ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాలు, నక్సలైట్లకు మధ్య పరస్పర కాల్పులు జరిగాయి. ఇందులో 16 మంది చనిపోగా ఇద్దరు గాయపడ్డారు.
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని కెర్లపాల్ ప్రాంతంలో శనివారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు 16 మంది నక్సలైట్లను మట్టుబెట్టాయి. అయితే ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా గాయపడ్డారు. ఇవాళ(శనివారం) ఉదయం 8 గంటలకు ఈ కాల్పులు ప్రారంభంకాగా ప్రస్తుతం ముగిసినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఎన్కౌంటర్ పై బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (IG) ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ మాట్లాడుతూ... ఎన్‌కౌంటర్‌లో 16 మంది నక్సల్స్ హతమయ్యారని, ఇద్దరు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. శుక్రవారం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సంయుక్తంగా నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించడంతో కాల్పులు మొదలయ్యాయి.
సుక్మా పోలీస్ స్టేషన్ పరిధిలోని కెర్లపాల్ ప్రాంతంలో నక్సల్స్ ఉన్నారనే పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ ప్రారంభించామని తెలిపారు. సంయుక్త బృందం మార్చి 28న సెర్చ్ మిషన్ కోసం బయలుదేరింది. శనివారం (మార్చి 29) తెల్లవారుజాము నుండి అడపాదడపా కాల్పులు కొనసాగుతున్నాయి. అయితే ఇవాళ ఉదయం నక్సల్స్ బృందం బద్రతాదళాలకు తారసపడింది. దీంతో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ప్రస్తుతం భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో, చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
ఇదిలాఉంటే మార్చి 22న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో మాట్లాడుతూ... 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి నక్సలిజం నిర్మూలించబడుతుందని చెప్పారు. 2004 నుంచి 2014 మధ్య 16,463 హింసాత్మక సంఘటనలు జరిగాయని, గత పదేళ్లలో ఈ సంఖ్య 53% తగ్గిందని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు.
2004 నుంచి 2014 వరకు 1,851 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారని, గత పదేళ్లలో మరణించిన భద్రతా సిబ్బంది సంఖ్య 509కి తగ్గిందని, ఇది 73% తగ్గింపు అని ఆయన పేర్కొన్నారు. పౌరుల మరణాల సంఖ్య 4,766 నుంచి 1,495కి తగ్గింది, ఇది 70% తగ్గింపు. 2014 నుంచి 2024 వరకు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 11,503 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మించబడ్డాయని కేంద్ర హోం మంత్రి తెలిపారు.
అదనంగా 20,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులు నిర్మించబడ్డాయి. మొదటి దశలో 2,343 మొబైల్ టవర్లు ఏర్పాటు చేయబడ్డాయి, రెండో దశలో 2,545 టవర్లు ఏర్పాటు చేయబడ్డాయి. 4,000 మొబైల్ టవర్ల ఏర్పాటు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నాటికి నక్సల్ ప్రభావిత ప్రాంతాలన్నింటికీ మొబైల్ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని షా పేర్కొన్నారు.