మద్యం జనాన్ని ఏకం చేస్తుంది.. మేం కూడా వాడతాం : ‘‘ డీ - అడిక్షన్ ’’ కార్యక్రమానికి వెళ్లి మంత్రి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Sep 1, 2022, 6:03 PM IST
Highlights

మద్యపానంపై ఛత్తీస్‌గఢ్ విద్యా శాఖ మంత్రి ప్రేమ్ సాయి సింగ్ టేకమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యపానం ప్రజలను ఏకం చేస్తుందని.. అయితే నియంత్రిత పద్ధతిలో సేవించాలంటూ ఆయన పేర్కొన్నారు. 

ఛత్తీస్‌గఢ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి ప్రేమ్ సాయి సింగ్ టేకమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డి- అడిక్షన్ కార్యక్రమంలో హరివంశ్ రాయ్ బచ్చన్ రచించిన పుస్తకం ‘మధుశాల’ పంక్తులను పఠించి వివాదంలో చిక్కుకున్నారు. మద్యపానం ప్రజలను ఏకం చేస్తుందని.. అయితే నియంత్రిత పద్ధతిలో సేవించాలంటూ ప్రేమ్ సాయి వ్యాఖ్యలు చేయడంపై విపక్షాలు, నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. వాద్రాఫ్‌నగర్‌లోని పాఠశాల విద్యార్ధులతో కలిసి ‘నషా ముక్తి అభియాన్’ ఆధ్వర్యంలో పోలీసులు నిర్వహించిన కార్యక్రమంలో ప్రేమ్ సాయి ప్రసంగించారు. దీనికి సంబంధించి ఒక నిమిషం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

అందులో హరివంశ్ రాయ్ బచ్చన్ జీ ... ‘మందిర్ మస్జిద్ ఝగ్దా కరాటే, లేకిన్ ఏక్ కరాటీ మధుశాల’ అని రాశారని  ప్రేమ్ సాయి వ్యాఖ్యానించారు. అయితే (మద్యం వినియోగంలో) నియంత్రణలో వుండాలని ఆయన అన్నారు. తాను ఒక సమావేశానికి హాజరయ్యానని... అక్కడ ఒక వర్గం దాని దుష్ప్రభావాలను పేర్కొంటూ మద్యం వినియోగాన్ని వ్యతిరేకించిందన్నారు. కానీ మరొక వర్గం దాని ప్రయోజనాలను పేర్కొంటూ దానికి అనుకూలంగా వుందని మంత్రి తెలిపారు. మద్యం అందరినీ ఏకం చేస్తుందని.. తాము కొన్ని సార్లు వేడుకలు, ఎన్నికల్లోనూ దీనిని ఉపయోగిస్తామని ఆయన చెప్పారు. అయితే మద్యపానం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి సభకు సలహాలిస్తూ.. అలవాటు పడకూడదని ప్రేమ్ సాయి సూచించారు. 

దీనిపై ప్రతిపక్ష బీజేపీ మండిపడింది. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘కార్టూన్ల’కు కొరత లేదని సెటైర్లు వేశారు బీజేపీ ఎమ్మెల్యే అజయ్ చంద్రాకర్. వారిలో ఎవ్వరికీ విషయాలపై అవగాహన లేదని.. ఇది పనిచేసే ప్రభుత్వం కాదని, ఢిల్లీచే నియంత్రించబడుతున్న బొమ్మల ప్రదర్శన అని అజయ్ అన్నారు. ఇకపోతే.. మద్యానికి ప్రత్యామ్నాయంగా భాంగ్, గంజాయిని ప్రోత్సహించాలని బీజేపీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి బంధీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. 

click me!