చత్తీస్ గఢ్ లో భారీ ఎన్కౌంటర్... 12 మంది మావోలు, ముగ్గురు జవాన్లు మృతి

Published : Dec 03, 2025, 07:15 PM IST
chhattisgarh encounter

సారాంశం

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్కౌంటర్ లో 15 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

Chhattisgarh Encounter : మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరిట భద్రతా బలగాలు మావోయిస్టుల ఏరివేత చేపట్టింది… ఇందులో కోలుకోలేని దెబ్బ తగిలింది. హిడ్మా వంటి కొందరు అగ్రనాయకులతో పాటు చాలామంది ప్రాణాలు కోల్పోగా మరికొందరు పోలీసులకు లొంగిపోయారు. తాజాగా మరోసారి భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి... ఇందులో 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు మృతిచెందినట్లు సమాచారం. బస్తర్ ప్రాంతంలోని బీజాపూర్-దంతేవాడ సరిహద్దులో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. 

దంతేవాడ-బీజాపూర్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), ఎస్‌టీఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్ (కోబ్రా) బృందాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారట. దీంతో మావోలు కాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.

పశ్చిమ బస్తర్ డివిజన్ ప్రాంతంలో ఉమ్మడి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఈ క్రమంలో ఉదయం 9:00 గంటల ప్రాంతంలో కాల్పులు మొదలయ్యాయని ఆయన చెబుతున్నారు.

ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఇప్పటివరకు ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పి తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్స్,  303 రైఫిల్స్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉందని తెలిపారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో హెడ్ కానిస్టేబుల్ మోను వడాడి, కానిస్టేబుల్ డుకారు గోండేతో సహా ముగ్గురు డీఆర్‌జీ సిబ్బంది చనిపోయారని అధికారులు ధృవీకరించారు. సోమ్‌దేవ్ యాదవ్‌తో సహా ఇద్దరు డీఆర్‌జీ జవాన్లు గాయపడ్డారు. యాదవ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, తదుపరి వైద్య చికిత్స కోసం ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

ఎన్కౌంటర్ నేపథ్యంలో అదనపు బలగాలను మోహరించామని, ఆపరేషన్ కొనసాగుతున్నందున ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu