300 రకాల పాములు.. టూరిస్టుల కళకళలు, ఇదంతా గతం: కరోనాతో మూసివేత దశకు చెన్నై స్నేక్ పార్క్

By Siva KodatiFirst Published Jun 18, 2021, 3:41 PM IST
Highlights

చెన్నైలోని ప్రతిష్టాత్మక స్నేక్ పార్క్ ఇప్పుడు మూసివేత దశకు చేరుకుంది. కరోనా ప్రభావంతో ఆ పార్క్ వెళవెళబోతోంది. కొన్నాళ్లపాటు దాతల సహకారంతోనే నెట్టుకొచ్చినా.. ఇప్పుడిక నడపలేమని నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు

కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారతదేశం చివురుటాకులా వణికిపోయిన సంగతి తెలిసిందే. నిత్యం లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలతో దేశం ఎన్నడూ చూడని పరిస్థితులను చవిచూసింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌, కర్ఫ్యూ తరహా ఆంక్షలను అమలు చేశాయి. దీని ప్రభావం ఎన్నో రంగాలపై పడి లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. వీటిలో టూరిజం కూడా ఒకటి. నిత్యం దేశ విదేశాల నుంచి తరలివచ్చే యాత్రికులతో మనదేశంలోని పర్యాటక ప్రదేశాలు కళకళలాడేవి. గైడ్లు, ట్రావెల్ ఏజెంట్లు, హోటళ్లు, చిరు వ్యాపారులు ఇలా పర్యాటకులపై ఆధారపడి జీవించే లక్షలాది మంది రోడ్డునపడ్డారు. 

Also Read:ఇండియాలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు. మరణాలు

తాజాగా చెన్నైలోని ప్రతిష్టాత్మక స్నేక్ పార్క్ ఇప్పుడు మూసివేత దశకు చేరుకుంది. కరోనా ప్రభావంతో ఆ పార్క్ వెళవెళబోతోంది. కొన్నాళ్లపాటు దాతల సహకారంతోనే నెట్టుకొచ్చినా.. ఇప్పుడిక నడపలేమని నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. 1972లో ప్రారంభమైన చెన్నై స్నేక్ పార్కు దాదాపు నాలుగు దశాబ్దాలుగా సందర్శకులను ఆకట్టుకుంటూనే ఉంది. నగరంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఈ స్నేక్ పార్కు ఒకటి. కరోనా భయంతో సందర్శకులు రాకపోవడంతో ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఫలితంగా పార్కును మూసివేసే పరిస్థితి వచ్చింది. 

ఈ పార్కులో దాదాపు 3 వందల రకాల పాములు ఉన్నాయని నిర్వాహకులు చెప్పారు. గతంలో రోజుకు రూ. 6 నుంచి 8 లక్షల ఆదాయం వచ్చేదని చెబుతున్నారు.  పార్కులో పనిచేస్తున్న సిబ్బందికి వేతనం కింద రూ. 4 లక్షల వరకు ఖర్చు అవుతుందంటున్నారు. గతేడాది తొలి దశలో ఎదురైన కష్టాల నుంచి కోలుకోకముందే సెకండ్ వేవ్‌ కారణంగా మరిన్ని ఇబ్బందుల్లో కూరుకుపోయామని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

click me!