
చెన్నై: భార్య కోసం పోలీస్ కమిషనర్ అవతారమెత్తి డబ్బులు వసూలు చేస్తున్న విజయన్ అనే వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని కొలత్తూరుకు చెందిన విజయన్ పోలీసు అవతారమెత్తాడు. వాహనానికి సైరన్ బిగించుకొని ఏడాది కాలంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా విజయన్ ను పోలీసులు గుర్తించారు.ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం విజయన్, మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీలతో కూడ ఆయన ఫోటోలు దిగారు. విజయన్ గతంలో న్యూస్ ఛానెల్‌లో పనిచేశాడు. ఆ సమయంలో తనకున్న పరిచయాలతో వీఐపీలతో ఫోటోలు దిగినట్టుగా పోలీసులు విచారణలో గుర్తించారు.
దిండుగల్లు జిల్లా లక్ష్మీపురం జిల్లా టోల్ గేట్ వద్ద చిక్కిన విజయన్ ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. తన వాహనానికి సైరన్ పెట్టుకొని వెళ్తున్న సమయంలో పోలీసులు అనుమానం వచ్చిన అతడిని పరిశీలించారు. అనుమానాస్పదంగా ఆయన సమాధానాలు చెప్పడంతో పోలీసులు అతడిని విచారించారు. విజయన్ నుండి నకీలీ ఐడీ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
లారీల వ్యాపారం చేసిన విజయన్ ఈ వ్యాపారంలో నష్టపోయాడు. దీంతో ఆయన ఇంటి వద్దే ఉన్నాడు. అయితే పని పాటా లేకుండా ఎంతకాలం ఇంటివద్దే ఉంటావని భార్య విజయన్ తో తోడవ పెట్టుకొంది. దీంతో ఆయన పోలీస్ అవతారం ఎత్తాడు.గ్రూప్-1 ఉద్యోగం పాసై పోలీస్ ఉద్యోగం పొందినట్టుగా భార్యకు చెప్పాడు. అంతేకాదు అనతికాలంలోనే కమిషనర్ గా ప్రమోషన్ పొందానని కూడ నమ్మించాడు. తన స్నేహితురాలి సహాయంతో ఓ జీపును కొనుగోలు చేశాడు.ఈ జీపునకు సైరన్ బిగించాడు. నకిలీ పోలీస్ ఐడీ కార్డును సృష్టించి డబ్బులు వసూళ్లుచేస్తున్నాడు. ఏడాది కాలంగా విజయన్ నకిలీ పోలీస్‌గా చలామణి అవుతున్నాడు.