ఇస్రో మరో ఘనత సాధించింది. చరిత్రాత్మక చంద్రయాన్-3కు వరల్డ్ స్పేస్ అవార్డు లభించింది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో ల్యాండ్ చేసిన మొదటి దేశంగా భారతదేశాన్ని నిలిపినందుకు ఇస్రో ఈ గౌరవాన్ని అందుకుంది.
ముంబయి: అనేక విజయవంతమైన అంతరిక్ష ప్రయోగాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో మరో ఘనత సాధించింది. ఎన్నో సవాళ్ల నడుమ చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రోను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. చంద్రయాన్-3 ప్రయోగానికి ‘వరల్డ్ స్పేస్ అవార్డు’ దక్కింది.
చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో అడుగుపెట్టిన ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్‌ను నిలిపిన చంద్రయాన్-3కి అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ వరల్డ్ స్పేస్ అవార్డును ప్రకటించింది. భారత్‌తో పాటు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ మైలురాయిని సాధించాయి.
2023 ఆగస్టు 23న చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ అయింది. ఆ ప్రయోగం పూర్తయిన సరిగా ఏడాది తర్వాత ఇటలీలోని మిలాన్‌లో నిర్వహించే 75వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాంగ్రెస్ నిర్వహించనున్నారు. ఈ సభ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 14న ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
ఇస్రో చేపట్టిన చంద్రయాన్- 3 ప్రయోగంలో అనేక శాస్త్ర సాంకేతిక విశేషాలు, ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే, తక్కువ ఖర్చుతో కూడిన ఇంజినీరింగ్ సమన్వయానికి నిదర్శనం. భారతదేశ నిబద్ధతను, అంతరిక్ష అన్వేషణ మానవాళికి అందించే విస్తారమైన సామర్థ్యాన్ని చంద్రయాన్- 3 సూచిస్తుంది. చంద్రుని గురించి ఇంతకు ముందు వెలుగుచూడని కోణాలను వేగంగా ఆవిష్కరించిన ఈ మిషన్ ఆవిష్కరణకు ప్రపంచ సాక్ష్యంగా నిలుస్తుంది" అని ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ తెలిపింది.
భారత అంతరిక్ష, అణు రంగాలను విజయవంతంగా సమన్వయం చేయడం, మిషన్ ప్రొపల్షన్ మాడ్యూల్ అణు సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేయడం ద్వారా చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతమైంది. అలాగే, చంద్రయాన్- 3 ల్యాండింగ్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.