
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3కి లాంచ్‌ప్యాడ్ నిర్మాణంలో హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ టెక్నీషియన్ దీపక్ కుమార్ ఉప్రారియా పాలుపంచుకున్నాడు. ఇప్పుడు ఆయన ఇల్లు గడవడానికి రాంచీ రోడ్డు పక్కన ఇడ్లీ స్టాల్ పెట్టుకున్నాడు. ప్రతి రోజు ఇడ్లీలు అమ్మడం ద్వారా రూ. 300 నుంచి రూ. 400 వస్తున్నాయని, అన్నీ పోనూ రోజుకు రూ. 50 నుంచి రూ. 100 మిగులుతున్నాయని దీపక్ కుమార్ చెప్పాడు. ఈ డబ్బుతోనే ఇల్లు గడుస్తున్నదని వివరించాడు.
చంద్రయాన్ 3 సక్సెస్‌ను దేశమంతటా ఉత్సవాలు చేసుకుంది. కానీ, ఆ మిషన్ కోసం పని చేసిన టెక్నీషియన్ దీపక్ ఇప్పుడు రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముతున్నాడు. 18 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో పొట్టపోసుకోవడానికి రాంచీలో ధుర్వా ఏరియాలో ఓల్డ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎదురుగా దీపక్ కుమార్ ఈ ఇడ్లీ స్టాల్ పెట్టుకున్నాడు.
చంద్రయాన్ 3 సక్సెస్ కోసం రాంచీలోని హెచ్‌ఈసీ టెక్నీషియన్లు చేసిన వారికి 18 నెలలుగా జీతాలే అందలేవు. హెచ్ఈసీలో పని చేస్తున్న 2,800 మంది ఉద్యోగులకు 18 నెలలుగా జీతాలు రాలేవని బీబీసీ రిపోర్ట్ చేసింది. ఇందులో దీపక్ ఒకడు.
బీబీసీతో దీపక్ మాట్లాడుతూ.. ‘ఇల్లు గడవడానికి ఇడ్లీ స్టాల్ పెట్టుకున్నాను. ఉదయం ఆఫీసు వెళ్లడానికి ముందు ఇడ్లీలు అమ్ముతాను. మళ్లీ ఆఫీసు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇడ్లీలు అమ్ముతున్నాను’ అని వివరించాడు.
‘ఫస్ట్ నేను నా క్రెడిట్ కార్డ్‌తో ఇంటి ఖర్చు తీర్చుకున్నాను. ఆ తర్వాత రూ. 2 లక్షల లోన్ తీసుకున్నాను. తిరిగి చెల్లించకపోవడంతో డిఫాల్టర్ అయ్యాను. ఆ తర్వాత బంధువుల నుంచి డబ్బులు తీసుకుని ఇల్లు గడుపుకున్నాను. ఇప్పటి వరకు దాదాపు నాలుగు లక్షల అప్పులు చేశాను. వాటిలో ఏవీ తిరిగి ఇవ్వలేదు. దీంతో నాకు ఎవరూ అప్పు ఇవ్వడం లేదు. అప్పుడు నా భార్య నగలను కుదువపెట్టి కొన్నాళ్లు ఇంటి బాధ్యతలు కొనసాగించాను’ అని దీపక్ చెప్పాడు.
Also Read: చంద్రబాబు అరెస్టుపై నిర్మాత సురేష్ బాబు స్పందన.. ‘చంద్రబాబు చాలానే చేశారు’
‘ఆ డబ్బులు కూడా అయిపోయాక ఇల్లు గడవడం కష్టమైంది. ఆకలితో చచ్చిపోతామేమోనని అనిపించింది. అప్పుడు ఇడ్లీ స్టాల్ పెట్టాను. నా భార్య ఇడ్లీలు మంచిగా చేస్తుంది. రోజూ రూ. 300 నుంచి 400 వస్తాయి. అందులో నా లాభం రూ. 50 నుంచి 100 వరకు ఉంటుంది. ఈ డబ్బులతో ఇల్లు గడుస్తున్నది’ అని వివరించాడు.
మధ్యప్రదేశ్‌కు చెందిన దీపక్ 2012లో తన ప్రైవేటు ఉద్యోగాన్ని వదులుకుని హెచ్ఈసీలో రూ. 8000 జీతానికి కుదిరాడు. ప్రభుత్వ కంపెనీలో ఉద్యోగం కావడంతో భవిష్యత్ ఘనంగా ఉంటుందని అనుకున్నాడు. ‘నాకు ఇద్దరు కూతుళ్లు. ఇద్దరూ స్కూల్‌కు వెళ్లుతారు. ఈ ఏడాది ఇప్పటి వరకు స్కూల్ ఫీజులు కట్టలేదు. పేరెంట్స్ హెచ్ఈసీలో పని చేసే వారి పిల్లలు నిలబడండి అంటూ స్కూల్‌లోనూ వారిని అవమానిస్తున్నారు. నా పిల్లలు ఏడుస్తూ ఇంటికి రావడం చూస్తే నా గుండె బద్ధలవుతున్నది. కానీ, వారి ముందు నేను ఏడువను’ అని దీపక్ చెప్పాడు.
ఇది కేవలం దీపక్ పరిస్థితి మాత్రమే కాదు, హెచ్‌ఈసీలో పని చేస్తున్న ఇతర ఉద్యోగుులు కూడా జీవితం ముందుకు సాగడానికి ఇలాంటి పనులే చేసుకుంటున్నారని బీబీసీ రిపోర్ట్ చేసింది.
హెచ్ఈసీ 100 శాతం కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోనిది. వీరికి జీతాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నది.