
న్యూఢిల్లీ:మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ, ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు.ఖర్గే ప్రసంగానికి అడ్డుపడ్డారు.రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రసంగానికి బీజేపీ సభ్యులు అడ్డుతగిలారు. ఈ సమయంలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
2010లోనే రాజ్యసభలో మహిళా బిల్లును ప్రవేశ పెట్టిన విషయాన్ని ఖర్గే గుర్తు చేశారు. 2014లోనే రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ, ఎస్సీ రిజర్వేషన్లను చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.మహిళా బిల్లు క్రెడిట్ మోడీ తమకు ఇవ్వదలుచుకోలేదన్నారు.మహిళా రిజర్వేషన్లలో మూడో వంతు వెనుకబడిన కులాల మహిళలకు ఇవ్వాలని ఖర్గే డిమాండ్ చేశారు.గట్టిగా పోరాటం చేసే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం వాళ్లకు ఇష్టం లేదని బీజేపీపై ఖర్గే విమర్శలు చేశారు. అన్ని పార్టీలు మహిళలను చిన్న చూపు చూస్తున్నాయని ఖర్గే విమర్శించారు.ప్రశ్నించలేని మహిళలకు అవకాశం ఇచ్చారని ఖర్గే వ్యాఖ్యానించారు. వెనుకబడిన కులాల మహిళలకు పెద్దగా చదువు ఉండదని ఖర్గే చెప్పారు.మహిళా రిజర్వేషన్ బిల్లును సమర్ధవంతంగా అమలు చేయాలని ఆయన కోరారు.బలహీన మహిళలను బీజేపీ రాజకీయాల కోసం వాడుకుంటుందని ఖర్గే విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. మహిళా నేతలపై మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుబట్టారు.ఆదీవాసీ మహిళను రాష్ట్రపతిని చేసింది బీజేపీయేనని ఆమె గుర్తు చేశారు.
also read:మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నా: పార్లమెంట్ కొత్త భవనంలో మోడీ
ఇరుపక్షాలకు రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్ కర్ సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఖర్గే తన ప్రసంగాన్ని కొనసాగించారు. బీజేపీపై పదునైన విమర్శలు చేస్తూనే ఆయన ప్రసంగించారు.ఈ విమర్శలకు బీజేపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. బీజేపీ పాలనలో దేశంలో ఫెడరల్ వ్యవస్థ బలహీన పడుతుందన్నారు. చాలా ప్రభుత్వాలను బీజేపీ కూలదోసిందని ఆయన గుర్తు చేశారు.రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టడంలో బీజేపీది కీలకపాత్ర అని ఆయన ఆరోపించారు. చాలా రాష్ట్రాలకు జీఎస్టీ నిధుల చెల్లింపులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ సమయంలో మరోసారి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం చేసుకున్నారు. ఏ రాష్ట్రానికి కూడ జీఎస్టీ నిధుల బకాయిలు పెండింగ్ లో లేవని మల్లికార్జున ఖర్గేకు కౌంటరిచ్చారు.బకాయిలున్నట్టు ఆధారాలు చూపాలని ఖర్గేకు సవాల్ విసిరారు నిర్మలా సీతారామన్.
ఇవాళ మధ్యాహ్నం పార్లమెంట్ కొత్త భవనంలో రాజ్యసభ కొలువు దీరింది. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. బలహీనమైన మహిళలకే అవకాశాలు కల్పిస్తున్నారని ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో రగడను సృష్టించాయి.