ఈ ఫొటోలో ఎంత అర్థం ఉందో తెలుసా..? 

By Galam Venkata Rao  |  First Published Jun 5, 2024, 8:38 PM IST

ఈ ఫొటోలో ఎంత అర్థం ఉందో తెలుసా... బుధవారం ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్ష నేతల భేటీ జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మోస్ట్ పవర్ ఫుల్ గా కనిపించారు. ఈ ఫొటోలు చూస్తే.. చంద్రబాబు మరోసారి జాతీయ స్థాయిలో చక్రం తిప్పబోతున్నారా అనిపిస్తుంది...


 

Latest Videos

 

కేంద్ర కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ బుధవారం ఢిల్లీలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కీలక సమావేశం నిర్వహించింది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం చర్చించేందుకు నిర్వహించిన ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేతలతో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జేడీయూ నేత నితీష్ కుమార్, ఇతర మిక్షపత్రాల నేతలు పాల్గొన్నారు. మోదీ పక్క సీట్లోనే చంద్రబాబు కూర్చున్నారు. ఒకప్పుడు ప్రతిపక్ష నేతగా మోదీ, అమిత్‌ షాల అపాయింట్‌మెంట్‌ కోసం ఢిల్లీలో పడిగాపులు కాసిన బాబు.. ఎన్‌డీయే భేటీలో మోదీ పక్క సీట్లో కూర్చొని ఎంతో కాన్ఫిడెంట్‌గా, మోస్ట్‌ పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించారు. 

 

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన 144 స్థానాల్లో 135 గెలుచుకుంది. జనసేన, బీజేపీతో జట్టుగా పోటీ చేసినా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల మెజారిటీని దాటేసింది. ఇక లోక్‌సభ ఎన్నికల్లోనే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 25 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ పోటీచేసిన 17 స్థానాల్లో ఒకటి మినహా 16 చోట్లా విజయ ఢంకా మోగించింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే ఈ 16 ఎంపీ సీట్లు ఎన్‌డీయేకి కీలకం అయ్యాయి. దీంతో చంద్రబాబు కేంద్రంలో మళ్లీ చక్రం తిప్పే రోజులు వచ్చాయని చెప్పవచ్చు.  

 

 

20 ఏళ్ల తర్వాత గోల్డెన్‌ ఛాన్స్‌... 
ఇప్పుడు ఎన్‌డీయేలో ఇద్దరే ఇద్దరు పవర్‌ ఫుల్. ఒకరు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మరొకరు బిహార్‌ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌. ఎన్డీయే ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే చంద్రబాబు, నితీశ్‌ అత్యంత కీలకం. గత ఎన్నికల్లో మూడు పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న టీడీపీకి ఆ సీన్‌ లేదు. ప్రతిపక్షంలో ఉన్న అయిదేళ్లూ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు కేంద్రంలో కింగ్ మేకర్ అయ్యారు. ఎన్‌డీయేలోనే టీడీపీ ఉంటుందని చంద్రబాబు ప్రకటించాక.. నష్టాల్లో ఉన్న స్టాక్‌ మార్కెట్‌ను కూడా లాభాల్లోకి తీసుకెళ్లింది. 

 


ఇలాంటి అవకాశమే 20 ఏళ్ల క్రితం చంద్రబాబుకు వచ్చింది. అప్పట్లో వాజ్‌పేయి హయాంలో కేంద్రంలో చక్రం తిప్పారు. ఇప్పుడు మళ్లీ అలాగే గోల్డెన్ ఛాన్స్‌ రాబోతోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర కేబినెట్‌లో సైతం టీడీపీ ఎంపీలకు స్థానం దక్కనుంది. ఈ విధంగా చంద్రబాబు చెప్పిన మాట కేంద్రంలో తప్పనిసరిగా చెల్లే పరిస్థితి రానుంది. రాష్ట్రానికి కీలకమైన రాజధాని, అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా, రాష్ట్ర పురోగతికి అవసరమైన నిధులూ ఈసారి సాధించుకునే పరిస్థితి రానుంది.

 

 

జగన్ కి రాని అవకాశం చంద్రబాబుకు...

2019లో జగన్‌ ఇలాంటి అవకాశం వస్తుందా అనే ఎదురు చూశారు. కానీ రాలేదు. బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగే స్థాయికి అప్పట్లో చేరింది. ఇదే విషయాన్ని జగన్‌ స్వయంగా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. బీజేపీకి గానీ, కాంగ్రెస్‌కి గానీ కేంద్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి వస్తే కింగ్‌ మేకర్‌ తామే అయ్యేవారిమని గతంలో వాపోయేవారు. జగన్‌ కోరుకున్న అవకాశం ఇప్పుడు చంద్రబాబుకు వచ్చింది. రానున్న ఐదేళ్లు ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి....

click me!