జమ్ము కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. అక్కడికి 70 మంది కేంద్ర మంత్రులను పంపనున్న ప్రభుత్వం

By telugu teamFirst Published Sep 3, 2021, 4:12 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ము కశ్మీర్ ప్రజలకు చేరువ కావాలనే లక్ష్యంతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కనీసం 70 మంది కేంద్ర మంత్రులను జమ్ము కశ్మీర్ పర్యటనకు పంపనుంది. వీరంతా అక్కడి ప్రజలు, అధికారులు, ప్రముఖలతో చర్చలు జరిపి కేంద్ర హోం శాఖ, పీఎంవోకు తమ నివేదికను సమర్పించనున్నారు.

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే అధికరణం 370ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిన తర్వాత అక్కడ పరిస్థితులు సున్నితంగా మారాయి. స్థానిక పార్టీలన్నింటి నుంచి వ్యతిరేకత వచ్చింది. కశ్మీరీలూ ఆర్టికల్ 370 నిర్వీర్యాన్ని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే ముప్పును నియంత్రించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌లో దీర్ఘకాలం ఆంక్షలు విధించింది. ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. అక్కడి ప్రధాన స్రవంతి రాజకీయపార్టీలు, ప్రజల కార్యక్రమాలు నిర్వహించి సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే గతేడాది జనవరిలో 36 మంది కేంద్రమంత్రులు జమ్ము కశ్మీర్ పర్యటించారు. తాజాగా ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కార్యక్రమానికి సన్నద్ధమవుతున్నది. కశ్మీరీలకు చేరువకావాలనే లక్ష్యంతో అక్కడికి కనీసం 70 మంది కేంద్రమంత్రులను పంపడానికి నిర్ణయం తీసుకుంది. తొమ్మిదివారాల సుదీర్ఘమైన కార్యక్రమంలో భాగంగా వీరిని అక్కడికి పంపనుంది. సెప్టెంబర్ 10 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రతి వారానికి ఏడు నుంచి ఎనిమిది మంది కేంద్ర మంత్రులు కశ్మీర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో వారు సాధారణ ప్రజలు, అధికారులు, పంచాయతీ రాజ్ సంస్థలు సహా పలువురు ప్రముఖులను కలువనున్నారు.

వీరి పర్యటన షెడ్యూల్‌ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కేంద్ర హోం శాఖతో సమన్వయంతో ఖరారు చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రిమండలిలో కొత్త చేరిన సభ్యులు తొలిసారిగా మంత్రి హోదాలో  కశ్మీర్ పర్యటించనున్నారు. కశ్మీర్ పర్యటించిన తర్వాత కేంద్రమంత్రులు అందరు కేంద్ర హోం వ్యవహారాల శాఖ, ప్రధానమంత్రి కార్యాలయానికి నివేదిక సమర్పించనున్నారు.

చివరిసారి మంత్రులు కశ్మీర్ పర్యటించినప్పుడు జమ్ములో 52 లొకేషన్‌లలో, కశ్మీర్‌లో ఎనిమిది చోట్ల ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ నెలలో మొదలయ్యే తాజా కార్యక్రమంలో భాగంగానూ ఇదే తరహాలోనే కేంద్ర మంత్రులు కశ్మీరీలతో సంభాషించే అవకాశముంది.

click me!