నన్ను నిర్ణయం తీసుకోనివ్వండి, లేదంటే..: కాంగ్రెస్‌కు సిద్దూ వార్నింగ్

By telugu teamFirst Published Aug 27, 2021, 2:48 PM IST
Highlights

పంజాబ్‌లో రాజకీయం అంతా నవజోత్ సింగ్ సిద్దూ చుట్టే తిరుగుతున్నది. ఆయన సలహాదారులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి ఆయన హాట్ టాపిక్ అయ్యారు. సలహాదారును తొలగించాలని, లేదంటే తానే తొలగిస్తారని కాంగ్రెస్ పంజాబ్ ఇన్‌చార్జీ హరీశ్ రావత్ వ్యాఖ్యలపై సిద్దూ తీవ్రంగా స్పందించారు. తనను నిర్ణయం తీసుకోనివ్వాలని లేదని ఎవ్వరినీ వదిలిపెట్టరని హెచ్చరించారు.
 

చండీగడ్: పంజాబ్‌లో అధికారపార్టీ కాంగ్రెస్‌లో బేధాభిప్రాయాలు సద్దుమణిగిపోలేదు. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు నవజోత్ సింగ్ సిద్దూకు మధ్య ఏర్పడిన అగాథాన్ని పూడ్చడానికి అధిష్టానం ప్రత్యేక భేటీలు నిర్వహించింది. చివరికి పంజాబ్ పీసీసీ చీఫ్ పదవిని ఇచ్చి సిద్దూను శాంతింపజేసింది. కానీ, ఆయన సలహాదారులు ఇటీవలే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీ యూనిట్‌లో మళ్లీ కలకలాన్ని రేపింది. 

తనను నిర్ణయం తీసుకోనివ్వాలని సిద్దూ అన్నారు. లేదంటే ఎవ్వరినీ వదిలిపెట్టబోనని హెచ్చరించారు. ‘నిర్ణయం తీసుకోవడానికి అనుమతించాలని హైకమాండ్‌ను అడిగాను. కనీసం మరో రెండు దశాబ్దాలు కాంగ్రెస్ రాష్ట్రంలో జవసత్వాలతో కొనసాగేలా పనిచేస్తాను. లేదంటేనా.. ఎవ్వరినీ వదిలిపెట్టను’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పంజాబ్ ఇన్‌చార్జీ హరీశ్ రావత్ స్పందన కోరగా ‘మీడియా ప్రచారాలను ఆధారంగా చేసుకుని నేను ఆయనను ప్రశ్నించను. ఆయన ఏ నేపథ్యంలో అలాంటి వ్యాఖ్యలు చేశాడో చూస్తాను. ఆయనే పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్. ఆయన కాకుండా ఇంకెవరు నిర్ణయాలు తీసుకుంటారు మరి’ అని అన్నారు. 

జమ్ము కశ్మీర్, తాలిబాన్ల గురించి నవజోత్ సింగ్ సిద్దూ సలహాదారు మల్విందర్ సింగ్ మలి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో హరీశ్ రావత్ ఆయనను తొలగించాలని గట్టిగా చెప్పారు. ‘ఈ సలహాదారులను పార్టీ అపాయింట్ చేయలేదు. వారిని డిస్మిస్ చేయాలని సిద్దూను అడిగాను. ఒకవేళ సిద్దూ వారిని డిస్మిస్ చేయకుంటే, నేనే చేస్తా. పార్టీని నవ్వులపాలు చేసే వారిని ఉంచుకోవాలని భావించట్లేదు’ అని అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా సిద్దూ తీవ్రంగా స్పందించారు. తనను నిర్ణయం తీసుకోనివ్వాలని, లేదంటే ఎవ్వరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. ఈ రోజు సిద్దూ సలహాదారు మల్విందర్ సింగ్ మలి వైదొలిగిన సంగతి తెలిసిందే.

click me!