రాష్ట్ర జాబితాలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయడం మానుకోవాలి: కేరళ సీఎం

By Mahesh RajamoniFirst Published Aug 8, 2022, 2:58 AM IST
Highlights

CM  Pinarayi Vijayan: రాజ్యాంగంలోని సమాఖ్య నిర్మాణానికి కేంద్రం విరుద్ధం కాకూడదని, దాని ఉమ్మడి జాబితాలోని అంశాలకు సంబంధించిన చట్టాన్ని రాష్ట్రాలతో సంప్రదించి చేపట్టాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. 
 

NITI Aayog meeting: రాజ్యాంగంలోని రాష్ట్ర జాబితాలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయడం మానుకోవాలని కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజయన్ అన్నారు. రాజ్యాంగంలోని సమాఖ్య నిర్మాణానికి కేంద్రం విరుద్ధం కాకూడదనీ, దాని ఉమ్మడి జాబితాలోని అంశాలకు సంబంధించిన చట్టాన్ని రాష్ట్రాలతో సంప్రదించి చేపట్టాలని పేర్కొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి జరిగిన నీతి ఆయోగ్ 7వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఫెడరలిజాన్ని స‌వాల్ చేయవద్దని కేంద్రానికి చెప్పడంతో పాటు, కోవిడ్-19 వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యల నుండి కేరళ ఇంకా కోలుకోనందున దాని క్రెడిట్-పరిమితిని పెంచడానికి చర్యలు తీసుకోవాలని పిన‌ర‌యి విజయన్ అన్నారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా రాజ్యాంగంలోని 11వ, 12వ షెడ్యూళ్లలో పేర్కొన్న పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించిన విషయాలను స్థానిక స్వపరిపాలన సంస్థలకు దక్షిణాది రాష్ట్రం కేర‌ళ అప్పగించిందని ఆయన అన్నారు. కాబట్టి, ఏకీకృత నిధులను పంపిణీ చేసేటప్పుడు కూడా కేంద్రం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఒక కిలోమీటరు వైడ్ ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎస్‌జెడ్)ను నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు చట్టపరమైన పరిష్కారం అవసరమని కూడా ఆయన చెప్పారు. 

ఈ ఏడాది జూన్‌లో సుప్రీంకోర్టు ఆదేశాలతో కేరళలోని కొండలు-అటవీ ప్రాంతాలలో నివసించే వారిలో చాలా ఆందోళ‌న క‌లిగించింది. ఇది అమలు చేస్తున్నప్పుడు రాష్ట్రంలోని నివాస స్థలాలు-వ్యవసాయ భూములను మినహాయించాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలతో సహా ప్రతి రక్షిత అటవీ ప్రాంతం తప్పనిసరిగా ఒక కి.మీ మేర ESZని కలిగి ఉండాలనీ, దేశవ్యాప్తంగా అటువంటి పార్కులలో మైనింగ్ కార్యకలాపాలను నిషేధించాలని జూన్ 3న సుప్రీం కోర్టు ఆదేశించింది. అటువంటి జోన్లలో శాశ్వత నిర్మాణాన్ని అనుమతించబోమని సుప్రీం కోర్టు పేర్కొంది. స్థానిక చట్టం లేదా ఇతర నిబంధనల ప్రకారం ఒక కిమీ కంటే ఎక్కువ ESZ కోసం అందించినట్లయితే, మునుపటి నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.

పట్టణ, గ్రామీణ ప్రాజెక్టులకు PMAY కింద నిధుల కేటాయింపులు పెరగడం, జాతీయ రహదారి అభివృద్ధిని సకాలంలో పూర్తి చేయడం, కేరళ ఎయిర్-రైలు ప్రాజెక్టులను ఆమోదించడం, తీరప్రాంత రక్షణను మెరుగుపరచడానికి సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందించడం, వాటిని సమీక్షించడం వంటి ఇతర అంశాలు త‌న ప్రసంగంలో విజ‌య‌న్ ప్ర‌స్తావించారు. కొబ్బరి నుండి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి, పామాయిల్ ఉత్పత్తికి, వేరుశెనగ ఉత్పత్తికి కొత్త ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి కేంద్రం నుండి సాంకేతిక మద్దతు, ఆర్థిక సహాయాన్ని కూడా విజయన్ కోరారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్లను కేంద్రం మరింత సీరియస్‌గా పరిశీలించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆదివారం ఉద్ఘాటించారు. కేంద్ర విధానాల విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఒత్తిడిని తీసుకువ‌స్తూ.. వాటిని బ‌ల‌వంతంగా రుద్ద‌వ‌ద్ద‌ని పేర్కొన్నారు.  కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌హ‌కారం ఉంటేనే మెరుగైన అభివృద్ధి జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

click me!