న్యూఢిల్లీ:కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల సమస్యలపై కేంద్రం దృష్టి పెట్టింది. వలస కూలీల సమస్యలను పరిష్కరించేందుకు గాను దేశ వ్యాప్తంగా 20 కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్టుగా కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ మంగళవారం నాడు ప్రకటించింది.
ఏప్రిల్ 20వ తర్వాత కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ పాక్షికంగా సడలింపు ఇచ్చే అవకాశం లేకపోలేదు. కరోనా కేసులు లేని ప్రాంతాల్లో లాక్ డౌన్ ను పాక్షికంగా సడలించే అవకాశం ఉందని సమాచారం.
గత మూడు వారాలుగా దేశంలో లాక్ డౌన్ అమల్లో ఉంది. ఈ ఏడాది మే 3వ తేదీవరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కేంద్రంం ఇవాళ నిర్ణయం తీసుకొంది. లాక్ డౌన్ కారణంగా వలసకూలీలు రోజువారీ వేతనాలను కోల్పోతున్నారు. అంతేకాదు ఉపాధి కోల్పోయారు. పని లేక కార్మికులు తమ స్వగ్రామాలకు తరలివెళ్లారు. రవాణా సౌకర్యం లేని కారణంగా వలస కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
also read:
లాక్‌డౌన్: మే 3 వరకు అన్ని విమానాలు, రైళ్లు రద్దు
వలస కార్మికుల వేతన సమస్యలతో పాటు ఇతర సమస్యలను కూడ ఈ కంట్రోల్ రూమ్ ల్లో ఉన్న అధికారులు పరిష్కరించనున్నారు.ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ కంట్రోల్ రూమ్ లు పరిష్కరించనున్నాయి.
ఈ మెయిల్స్ లేదా కంట్రోల్ రూమ్స్ లో ఉన్న అదికారులను వాట్సాప్ లేదా ఫోన్లలో సంప్రదించవచ్చని కేంద్రం ప్రకటించింది. అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు, ప్రాంతీయ లేబర్ కమిషనర్లు, లేబర్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు, డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్లు ఈ కంట్రోల్ రూమ్స్ ను నిర్వహించనున్నారు.
ఈ 20 కంట్రోల్ రూమ్స్ పనితీరును చీఫ్ లేబర్ కమిషనర్ ప్రతి రోజు పర్యవేక్షించనున్నారని కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది.