
Naxal violence: దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం లోక్‌సభలో వెల్లడించారు. 2014లో నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య 70 ఉండగా, 2021 నాటికి ఆ సంఖ్య 46కి పడిపోయిందని మంత్రి తెలిపారు. అలాగే.. వామపక్ష తీవ్రవాదం, నక్సల్ హింస కూడా తగ్గుముఖం పట్టిందని ఓ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 2014లో 1,091 కేసులు నమోదు కాగా 2021 నాటికి 509కి పడిపోయాయని హోం మంత్రిత్వ శాఖ మంత్రి తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయాన్ని పెంచిందని, ఎల్‌డబ్ల్యుఇ ప్రభావిత ప్రాంతాల కోసం అనేక పథకాలను ప్రారంభించామని ఆయన చెప్పారు.
2014-15 నుంచి 2021-22 వరకు కేంద్ర హోంశాఖ నక్సల్స్ ప్రభావిత జిల్లాలకు పలు పథకాల కింద రూ.6,578 కోట్లు విడుదల చేసిందని హోంశాఖ సహాయ మంత్రి తెలిపారు. బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ సింగ్ అడిగిన ప్రశ్నలకు నిత్యానంద రాయ్ సమాధానమిచ్చారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రత సంబంధిత వ్యయం, ప్రత్యేక మౌలిక సదుపాయాల పథకం, ప్రత్యేక కేంద్ర సహాయ పథకం, రోడ్ కనెక్టివిటీ, స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్, జవహర్ నవ విద్యాలయం, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్, ఆర్థిక సహాయం వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. .
కేంద్ర పథకాల కింద నిధుల కేటాయింపు
భద్రత సంబంధిత అవసరాల కోసం 2014-15లో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం రూ.2,302 కోట్లు విడుదల చేసిందని నిత్యానంద రాయ్ తెలిపారు. 2017-18 లో ప్రత్యేక మౌలిక సదుపాయాల పథకం కింద నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 250 పోలీస్ స్టేషన్లు, స్పెషల్ ఫోర్సెస్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌ల ఏర్పాటుకు రూ.991.04 కోట్లతో ప్రాజెక్టులు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రత్యేక కేంద్ర సహాయ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం రూ.3,085.74 కోట్లు విడుదల చేసింది. ఇవి కాకుండా మే 2014 నుంచి రోడ్ రిక్వైర్‌మెంట్ ప్లాన్-1 పథకం కింద 2,134 కి.మీ రోడ్డు నిర్మాణం జరిగిందనీ, ఇందులో గయాలో 205 కి.మీ, ఔరంగాబాద్‌లో 116 కి.మీల రోడ్డు నిర్మాణం జరిగిందని తెలిపారు.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ కింద 12,082 కి.మీ ఏర్పాటు చేశామని, ఇందుకోసం రోడ్డు నిర్మాణ ప్రాజెక్టుకు రూ.11,780 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి తెలిపారు. వీటిలో బీహార్‌లోని గయాలో 196 కి.మీ, ఔరంగాబాద్‌లో 237 కి.మీ సహా 6,274 కి.మీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు.
ఐటీఐ, కేవీ, జేఎన్‌వో ఏర్పాటు
ఇవి కాకుండా 47 ఎల్‌డబ్ల్యుఇ ప్రభావిత జిల్లాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ కింద 40 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు (ఐటిఐలు), 61 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు (ఎస్‌డిసిలు) లను కేంద్రం ఏర్పాటుచేసింది. మే 2014 తర్వాత.. ఎనిమిది ITIలు, ఆరు SDCలు స్థాపించబడ్డాయి. అలాగే.. నక్సల్ ప్రభావిత జిల్లాల్లో 32 కేంద్రీయ విద్యాలయాలు, 9 జవహర్ నవ విద్యాలయాలు ప్రారంభించబడ్డాయి. గయాలో రెండు కేంద్రీయ విద్యాలయాలు (కెవిలు), రెండు జవహర్ నవ విద్యాలయాలు (జెఎన్‌వి) నిర్మాణం జరిగింది. అదే సమయంలో.. ఔరంగాబాద్‌లో ఒక జెఎన్‌వి, రెండు కెవిలు స్థాపించబడ్డాయి.