
దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో 'ఒకే దేశం, ఒకే విద్యుత్ టారిఫ్' విధానాన్ని అమలు చేయాలన్న తన డిమాండ్‌ను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పునరుద్ఘాటించారు. విద్యుత్ ధరలలో సమానత్వం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశ నిర్మాణంలో ప్రతి రాష్ట్రం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని నితీశ్ అన్నారు. రాష్ట్రాల నిర్మాణాత్మక భాగస్వామ్యం లేకుండా దేశ సమగ్రాభివృద్ధి గురించి ఆలోచించలేమని అన్నారు. దేశంలో 'ఒకే దేశం, ఒకే విద్యుత్ టారిఫ్' ఉండాలని గతంలో కూడా చెప్పాను. కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తి యూనిట్ల నుంచి అధిక ధరలకు విద్యుత్‌ను ఎందుకు కొనుగోలు చేస్తున్నాయి? అన్నారు.
బీహార్ శాసనసభ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ.. ఇతర రాష్ట్రాల కంటే బీహార్‌కు కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నుంచి అధిక రేటుకు విద్యుత్ లభిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఒకే విధమైన విద్యుత్తు రేటు ఉండాలని, కేంద్ర ప్రభుత్వం 'ఒక దేశం, ఒకే విద్యుత్తు రుసుము' గురించి ఆలోచించాలని అన్నారు. అలాగే.. బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే తన డిమాండ్‌ను ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం వెనుకబడిన రాష్ట్రాలను విస్మరిస్తోందని విమర్శించారు.
బీహార్‌కే కాకుండా అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ హోదా అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడేలా చేస్తుందని ఆయన అన్నారు. బీహార్ ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో ఒకటి. బీహార్ నిలకడగా అభివృద్ధి చెందడమే కాకుండా అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాలను కూడా అధిగమించిందని ముఖ్యమంత్రి అన్నారు. 2021-22లో బీహార్ 10.98 శాతం వృద్ధిని నమోదు చేసిందని, ఇది జాతీయ సగటు 8.68 శాతం కంటే మెరుగ్గా ఉందని ఆయన చెప్పారు.