కర్ణాటకలో ఆక్సిజన్‌కు కటకట: మేం కలగజేసుకోలేం...సుప్రీంకోర్టులో కేంద్రానికి షాక్

By Siva KodatiFirst Published May 7, 2021, 3:28 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటకకు రోజువారీ ఆక్సిజన్ సరఫరాను పెంచాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపేసేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. కర్ణాటక ప్రజలను దిక్కులేని స్థితిలోకి నెట్టలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం వెల్లడించింది. 
 
కోవిడ్-19 సెకండ్ వేవ్ తీవ్రంగా వున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. మరీ ముఖ్యంగా రాజధాని బెంగళూరులో అత్యధిక సంఖ్యలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఎన్నడూ లేని విధంగా కర్ణాటకలో 49,058 కొత్త పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 328 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు మే 5న ఇచ్చిన ఆదేశాల్లో రాష్ట్రానికి రోజువారీ ఆక్సిజన్ సరఫరాను 1,200 మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను నిలిపేయాలని కోరుతూ కేంద్రం గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

Also Read:మీడియాపై ఈసీ పిటిషన్‌: కొట్టివేసిన సుప్రీం

దీనిపై జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి తగిన కారణం కనిపించడం లేదని వెల్లడించింది.

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ, కర్ణాటకకు రోజువారీ 965 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రతి హైకోర్టు ఈ విధంగా ఆదేశాలు జారీ చేస్తూ ఉంటే, దేశంలో ఆక్సిజన్ పంపిణీ, నిర్వహణలో అరాచకం ప్రబలుతుందన్నారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి, సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

click me!