పండుగ సీజన్ సందర్భంగా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు.. దేశంలో 300 డెల్టా ప్లస్ కేసులు

By telugu teamFirst Published Sep 2, 2021, 6:29 PM IST
Highlights

థర్డ్ వేవ్ ముప్పుపై విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో పండుగ సీజన్‌ను పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఇళ్లల్లోనే పండుగులు జరుపుకోవాలని కోరింది. బయట సమూహాలుగా వేడుకలు చేసుకోవాలంటే తప్పనిసరిగా రెండు డోసుల టీకా తీసుకుని ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటి వరకు సుమారు 300 డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్టు వివరించింది.

న్యూఢిల్లీ: థర్డ్ వేవ్ ఎప్పుడు అటాక్ చేస్తుందో తెలియని పరిస్థితుల్లో పండుగ సీజన్ ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పలు సూచనలు చేసింది. పండుగ వేడుకలు ఇంటికే పరిమితం చేసుకోవాలని కోరింది. పండుగలు ఇంట్లోనే జరుపుకోవాలని, బయటికెళ్లి సమూహంలో కలువాలనుకుంటే తప్పనిసరిగా రెండు డోసుల టీకా తీసుకుని ఉండాలని తెలిపింది. సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని, కాబట్టి, కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.

గతనెల చివరివారంలో దేశంలోని 39 జిల్లాల్లో పది శాతం కొవిడ్ పాజిటివిటీ రిపోర్ట్ అయిందని కేంద్రం తాజాగా వెల్లడించింది. 38 జిల్లాల్లో 5శాతం నుంచి 10శాతం నమోదైందని తెలిపింది. దేశంలోని 16శాతం జనాభా టీకా రెండు డోసులు తీసుకున్నారని వివరించింది. 54శాతం మంది కనీసం ఒక్క డోసైనా తీసుకున్నారని పేర్కొంది. 

మూడో వేవ్ ముప్పు ఉన్న నేపథ్యంలో రానున్న పండుగ సీజన్‌ను ఆంక్షల మధ్యే గడపాలని ప్రజలకు సూచించింది. వేడుకల కోసం గుమిగూడవద్దని, ఎవరికి వారే పండుగను ఇళ్లల్లోనే జరుపుకోవాలని సూచించింది. బయటికి వెళ్లవద్దని తెలిపింది. ఒకవేళ కచ్చితంగా వెళ్లాలని భావిస్తే వారు తప్పకుండా రెండు డోసలు టీకాలు వేసుకుని ఉండాలని స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటి వరకు ఇంచుమించు 300కుపైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని వివరించింది.

click me!