‘మీ క్యాస్ట్‌ కోసం నీవేం చేశావు’.. మరింత ప్రొఫెషనల్‌గా బీఎస్పీ అభ్యర్థుల ఎంపిక

By telugu teamFirst Published Sep 2, 2021, 5:42 PM IST
Highlights

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థలు ఎంపికను బీఎస్పీ మరింత ప్రొఫెషనల్‌ విధానంలో ఎంపిక చేయనుంది. ఆశావహులు ఏ సామాజిక వర్గానికి చెందినవారైనా, వారు ఆయా వర్గాల అభివృద్ధికి ఏం కృషి చేశారో వెల్లడించాల్సిందిగా కోరనుంది. ఇలాంటి కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందితేనే చివరికి బెహెన్‌జీ మాయావతి ఇంటర్వ్యూ చేసి అభ్యర్థిని ఖరారుచేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను జాగ్రత్తగా ఎంపిక చేయడానికి పార్టీ నిర్ణయించింది. ఆశావహులు ప్రత్యేకంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. నియోజకవర్గానికి షార్ట్ లిస్ట్ అయిన ఇద్దరు ముగ్గురిని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైనలైజ్ చేస్తారు. ఇందులో భాగంగా ఆశావహులు వారి క్యాస్ట్ అభివృద్ధికి ఏమేం చేశారో వెల్లడించాల్సి ఉంటుందని పార్టీవర్గాలు తెలిపాయి.

ఇప్పటికే నియోజవకర్గాల్లో ఆశావహుల నుంచి దరఖాస్తులను బీఎస్పీ ఆహ్వానిస్తున్నది. ఈ సారి అభ్యర్థులను మరింత ప్రొఫెషనల్‌గా ఎంపిక చేయాలనుకుంటున్న పార్టీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికలో పార్టీ జిల్లా బాధ్యులకు కీలక అధికారాలనిచ్చింది. జిల్లా బాధ్యులు పది మంది ఆశావహులను షార్ట్ లిస్ట్ చేయవచ్చు.

ఈ ప్రక్రియలో ఆశావహులు పలుకీలక ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బ్రాహ్మిణ్, ఠాకూర్, ఓబీసీ, లేదా దళిత సామాజికవర్గం నుంచి అయినప్పటికీ వారు వారివారి సామాజికవర్గాల అభివృద్ధికి ఏం చేశారో వివరించాల్సి ఉంటుందని తెలిపాయి. అంటే సమావేశాలు నిర్వహించడం, ర్యాలీలు తీయడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహణ వంటి వివరాలను పార్టీ ఆశిస్తున్నట్టు తెలుస్తున్నది. రాజకీయరంగంలో వారి విజయాలు, బహుజన సమాజానికి వారి ప్రత్యేక కృషినీ పొందుపరచాల్సి ఉంటుందని సమాచారం. వారి కుటుంబ నేపథ్యం, సమగ్ర వివరాలనూ ఇవ్వాలి.

నియోజకవర్గానికి ఇద్దరు లేదా ముగ్గురు ఆశావహుల చొప్పున జాబితాను బెహెన్‌జీ మాయావతికి పంపిస్తే ఆమె ఇంటర్వూ చేసి ఫైనల్ క్యాండిడేట్‌ను ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపికలో ఎప్పుడూ ముందుండే బీఎస్పీ ఈ సారి కూడా అక్టోబర్‌లోనే అభ్యర్థలు ఎంపికను ఫైనల్ చేయనున్నట్టు తెలుస్తున్నది.

click me!