
పంజాబ్ బీజేపీ నేతలకు భద్రత: పంజాబ్‌లో ఇటీవల కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన నలుగురు నేతలకు కేంద్రం భద్రత కల్పించింది. పంజాబ్ కేబినెట్ మాజీ మంత్రులు బల్బీర్ సింగ్ సిద్ధూ, గురుప్రీత్ సింగ్ కంగర్, మాజీ ఎమ్మెల్యే జగదీప్ సింగ్ నకాయ్, అమర్జీత్ సింగ్ టిక్కాలకు హోం మంత్రిత్వ శాఖ భద్రత కల్పించింది. వీరి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నదని ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక అందించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వారికి ఎక్స్ కేటగిరీ భద్రతను కల్పించింది. ఇప్పుడు ఈ నాయకులకు పారామిలటరీ ఫోర్స్ (CRPF) సైనికులు భద్రత కల్పించనున్నారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఆధారంగా.. పంజాబ్ కేబినెట్ మాజీ మంత్రులు బల్బీర్ సింగ్ సిద్ధూ, గురుప్రీత్ సింగ్ కంగర్, మాజీ ఎమ్మెల్యే జగదీప్ సింగ్ నకాయ్, అమర్జీత్ సింగ్ టిక్కాల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ బీజేపీ నేతలకు 24 గంటలూ ఎక్స్ కేటగిరీ భద్రత కల్పించాలని సీఆర్‌పీఎఫ్‌కి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నలుగురు నేతలు ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. దీని తరువాత.. ఈ నలుగురు నాయకులకు బెదిరింపులు వచ్చాయి. ఈ నేతలపై ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం ఉందని ఐబీ సమాచారం అందించింది. అందుకే సదరు నేతలకు ఎక్స్ కేటగిరీ భద్రత ఇవ్వాలని ఏజెన్సీ సిఫార్సు చేయగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ముఖ్యంగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరు కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత ఈ నేతలంతా బీజేపీలో చేరారు. అంతకుముందు.. అక్టోబర్‌లో కూడా పంజాబ్‌లోని ఐదుగురు బీజేపీ నేతలకు కేంద్రం ఇదే తరహాలో వై కేటగిరీ భద్రతను కల్పించింది. ఆ నేతలంతా మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో పాటు బీజేపీలో చేరారు.వీరితో పాటు పంజాబ్‌లోని పలువురు హిందూ నేతల భద్రత దృష్ట్యా వారి భద్రతను పెంచారు. ఈ ఏడాది పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా కాల్చి చంపడం గమనార్హం. సెక్యూరిటీ లేకుండా వ్యక్తిగత పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయనపై దాడి జరిగిన విషయం తెలిసిందే.