కేంద్రానికి ధైర్యం ఉంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయాలి - సంజయ్ రౌత్

Published : Aug 29, 2023, 01:16 PM IST
కేంద్రానికి ధైర్యం ఉంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయాలి - సంజయ్ రౌత్

సారాంశం

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని శివసేన (యూబీటీ) నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. భారత్ లోని కొన్ని భూ భాగాలను చైనా ఆక్రమించిందని, ఈ విషయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నిజమే అని అన్నారు.

కేంద్ర ప్రభుత్వంపై శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. భారత్ లోని కొన్ని భాగాలను చైనా ఆక్రమించిందని ఆరోపించారు. లడ్డాఖ్ లోని పాంగాంగ్ లోయలోకి చైనా ప్రవేశించిందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిజమే అని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఆగ్నేయాసియా దేశంపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని డిమాండ్ చేశారు. మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని, అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని తమ భూభాగంలో భాగంగా చూపిస్తూ చైనా తన తాజా ఎడిషన్ 'స్టాండర్డ్ మ్యాప్'ను అధికారికంగా విడుదల చేసిన నేపథ్యంలో సంజయ్ రౌత్ మంగళవారం ఈ వాఖ్యలు చేశారు. 

‘‘మన ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల బ్రిక్స్ సదస్సుకు హాజరై జిన్ పింగ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత చైనా మ్యాప్ వచ్చింది. లద్దాఖ్ లోని పాంగాంగ్ లోయలోకి చైనా ప్రవేశించిందని రాహుల్ గాంధీ చేసిన వాదన నిజమే. అరుణాచల్ లోకి ప్రవేశించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. మీకు (కేంద్ర ప్రభుత్వానికి) ధైర్యం ఉంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయండి’’ అని సంజయ్ రౌత్ అన్నారు.

కాగా.. ఆగస్టు 28న చైనా విడుదల చేసిన మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ లోని భాగంగా చూపించింది. అలాగే అక్సాయ్ చిన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం కూడా ఈ కొత్త మ్యాప్ లో చైనా భూభాగంలోనే కనిపిస్తున్నాయి. తొమ్మిది దశల రేఖపై చైనా వాదనలను కూడా ఈ మ్యాప్ లో పొందుపరిచారు. చైనా డైలీ వార్తాపత్రిక ప్రకారం.. జెజియాంగ్ ప్రావిన్స్ లోని డెకింగ్ కౌంటీలో సోమవారం సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ పబ్లిసిటీ డే, నేషనల్ మ్యాపింగ్ అవేర్నెస్ పబ్లిసిటీ వీక్ సందర్భంగా చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ఈ మ్యాప్ ను విడుదల చేసింది.

ఇదిలా ఉండగా.. ఇటీవల దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జిన్ పింగ్ సమావేశమయ్యారు. భారత-చైనా సరిహద్దు ప్రాంతాల పశ్చిమ సెక్టార్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి అపరిష్కృత సమస్యలపై భారత ఆందోళనలను ప్రధాని మోడీ అధ్యక్షుడు జీ జిన్పింగ్ తో జరిపిన సంభాషణలో ఎత్తిచూపారని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా ఆ సమయంలో తెలిపారు. 

కాగా.. ఈ నెల ప్రారంభంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లడఖ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైనాకు చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు భారత భూభాగంలో అంగుళం కూడా తీసుకోలేదనే కేంద్రం వాదనలో నిజం లేదని అన్నారు. స్థానికులు కూడా భారత భూభాగంలోకి చొరబడి చైనా దళాలు స్వాధీనం చేసుకున్నాయని వాదిస్తున్నారని, ఇది ఆందోళన కలిగించే అంశమని ఆయన అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..