
తమిళనాడు నీలగిరి కొండల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో (Tamil Nadu chopper crash) మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్ (Bipin Rawat) దంపతుల అస్థికలను వారి కుమార్తెలు శనివారం గంగానదిలో కలిపారు. హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్‌ల మృతదేహాలను గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలెం ఎయిర్‌బేస్‌కు తీసుకొచ్చారు. అనంతరం కామరాజ్ మార్గ్‌లోని వారి నివాసానికి తరలించారు. శుక్రవారం సాయంత్రం పూర్తి సైనికా లాంఛనాలతో బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటికలో నిర్వహించారు. రావత్ దంపతుల కూతుళ్లు.. కృతిక (Kritika), తరిణి (Tarini) లు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఇక, శనివారం ఉదయం బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటికకు (Brar Square crematorium) చేరుకున్న కృతిక, తరిణిలు తల్లిదండ్రుల చితాభస్మాన్ని సేకరించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ చేరుకున్నారు. హరిద్వార్‌లో గంగ (Ganga) నది తీరంలో సంప్రాదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. కృతిక, తరిణిలు వారి తల్లిదండ్రుల అస్థికలను గంగలో నిమజ్జనం చేశారు.
Also Read: Bipin Rawat Funeral : ఇక సెలవ్.. ముగిసిన రావత్ దంపతుల అంత్యక్రియలు, యావత్ దేశం కన్నీటి వీడ్కోలు
ఇక, ఢిల్లీలోని రావత్ నివాసానికి చేరుకున్న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటుగా పలువురు సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఇతర ప్రముఖులు రావత్ దంపతుల భౌతికకాయాలకు నివాళులర్పించారు. రావత్ దంపతుల అంతిమ యాత్రలో పాల్గొన్న వేలాది మంది వందేమాతం అంటూ నినాదాలు చేశారు. వివిధ దేశాల రక్షణ అధికారులు కూడా అంజలి ఘటించారు. అంత్యక్రియల సమయంలో రావత్‌కు 17 గన్ సెల్యూట్ ద్వారా గౌరవ వందనం సమర్పించారు.
అసలేం జరిగింది..
నీలగిరి జిల్లా వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కళాశాలలో సిబ్బంది, శిక్షణలో ఉన్న అధికారులను ఉద్దేశించి జనరల్ బిపిన్ రావత్ బుధవారం ప్రసంగించాల్సి ఉంది. ఇందుకోసం భార్య మధులిక రావత్, మరికొంతమంది సైనిక ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఢిల్లీ నుంచి బుధవారం ఉదయం తమిళనాడు బయలుదేరారు.బుధవారం ఉదయం 11.34 గంటలకు కోయంబత్తూరు జిల్లా సూలూర్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి 11:48 గంటలకు భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్‌కు బయలుదేరారు. అయితే మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో హెలికాఫ్టర్ కున్నూరు సమీపంలో కూలిపోయింది.