
గుజరాత్‌లోని మోర్బీ నగరంలో తీగల వంతెన కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 132కి చేరింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాదం జరిగిన స్థలంలో సహాయకచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే తాజాగా బ్రిడ్జి కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ వీడియోను పరిశలిస్తే.. చాలా మంది బ్రిడ్జిపై ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే కొందరు వ్యక్తులు.. వంతెనను కదిలిస్తున్నట్టుగా సీసీటీవీలో రికార్డు అయింది. ఈ క్రమంలోనే వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో వంతెనపై ఉన్న వందలాది మంది నీటిలో మారిపోయింది. ఆ వీడియోను చూస్తే ప్రమాదం జరిగిన తీరు చాలా భయానకంగా అనిపిస్తోంది.
గుజరాత్‌లోని మచ్చు నదిపై బ్రిటీష్ కాలంలో 19వ శతాబ్దంలో ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెనకు 143 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉంది. అయితే వంతెన దెబ్బతినడంతో.. కొన్ని నెలల కిందట మరమ్మతు పనులు చేపట్టారు. అయితే పునరుద్ధరణ తర్వాత గత వారం వంతెనను తిరిగి ప్రారంభించారు. అయితే పెద్ద సంఖ్యలో జనం చేరడంతో.. ఆదివారం సాయంత్రం వంతెన కూలిపోయింది. అయితే ఈ వంతెన నిర్వహణను నిర్వహిస్తున్న ఏజెన్సీపై గుజరాత్ రాష్ట్రం క్రిమినల్ ఫిర్యాదు చేసింది. అధికారుల అనుమతి లేకుండా వంతెనను తిరిగి ప్రారంభించారని స్థానిక పురపాలక సంఘం అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 132 మందికి చేరిందని గుజరాత్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 177 మందిని రక్షించినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన పలువురికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టుగా అధికారులు చెప్పారు.
Also Read: గుజరాత్ మోర్బీ వంతెన ప్రమాదం :132కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..
ఇక, రాష్ట్ర, జాతీయ విపత్తు సహాయ బృందాలు, భారత సైన్యానికి చెందిన వందలాది మంది సిబ్బంది ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి ఐదుగురు వ్యక్తులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసినట్లు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సాంఘవి చెప్పారు.