అవినీతి ఆరోపణల కేసులో ట్విస్ట్: తెరపైకి దేశ్‌ముఖ్ పీఏలు, విచారణకు పిలిచిన సీబీఐ

By Siva KodatiFirst Published Apr 11, 2021, 7:08 PM IST
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ బలవంతపు వసూళ్ల కేసులో ఆయన వ్యక్తిగత సహాయకులను (పీఏలు) సీబీఐ ప్రశ్నించనుంది. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ బలవంతపు వసూళ్ల కేసులో ఆయన వ్యక్తిగత సహాయకులను (పీఏలు) సీబీఐ ప్రశ్నించనుంది. ఈ కేసులో అవినీతి ఆరోపణలపై విచారణకు తమ ముందు హాజరుకావాల్సిందిగా దేశ్‌ముఖ్‌ పీఏలు ఇద్దరికి సీబీఐ నోటీసులు ఇచ్చింది.

ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరం బీర్ సింగ్ .. అనిల్‌ దేశ్‌ముఖ్‌పై చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతోంది. దీనిలో భాగంగానే దేశ్‌ముఖ్ పీఏలైన సంజీవ్ పలాండే, కుందన్‌లను సీబీఐ విచారించనుంది. ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలోనే అనూహ్యంగా పలాండే, కుందన్ పేర్లు తెరపైకి వచ్చాయి.

బలవంతపు వసూళ్లు చేయాలని వాజేను దేశ్‌ముఖ్ ఆదేశించినప్పుడు పలాండే అక్కడే ఉన్నాడని, ఇలాంటి ఒక సందర్భంలో కుందన్ కూడా అక్కడే ఉన్నాడని పరం బీర్ సింగ్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.

బార్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థల నుంచి ప్రతినెలా రూ.100 కోట్లు వసూలు చేయాలని ఇటీవల సస్పెండైన సచిన్ వాజేకు దేశ్‌ముఖ్ ఆదేశాలిచ్చినట్టు సీఎంకు రాసిన లేఖలో పరమ్ బీర్ సింగ్ ఆరోపించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Also Read:సచిన్ వాజేకు జ్యూడిషీయల్ కస్టడీ... ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి

అయితే, తనపై వచ్చిన ఆరోపణలను దేశ్‌ముఖ్ ఖండించారు. ఇదే సమయంలో ఆయన తన హోం మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాగా, ఈ కేసులో సీబీఐ బృందం ఇంతవరకూ, సచిన్ వాజే, డీసీపీ రాజు భుజ్‌బల్, ఏసీపీ సంజయ్ పాటిల్, అడ్వకేట్ జయశ్రీ పాటిల్, హోటల్ యజమాని మహేష్ షెట్టిల వాంగ్మూలాన్ని రికార్డు చేసింది.

సచిన్ వాజే‌ అసోసియేట్ అయిన ఏపీఐ రియాజ్ ఖాజిని ఎన్ఐఏ అరెస్టు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న సచిన్ వాజే.. మన్‌సుఖ్ హీరెన్ మృతి కేసుతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ వద్ద పేలుడు పదార్థాల నిండిన స్కార్పియో కేసులో నిందితుడుగా ఉన్నారు.

click me!