నీరా రాడియాకు సీబీఐ క్లీన్ చిట్.. ‘లీక్డ్ టేప్స్‌లో నేరపూరిత విషయాలేవీ లభించలేవు’

By Mahesh KFirst Published Sep 21, 2022, 3:53 PM IST
Highlights

నీరా రాడియా లీక్డ్ ఆడియో టేపులకు సంబంధించి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆమె ఆడియో టేపుల్లో నేరపూరిత అంశాలేవీ లేవని సుప్రీంకోర్టుకు తెలిపింది.

న్యూఢిల్లీ: నీరా రాడియాకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆమెకు, ఆమె క్లయింట్లకు మధ్య 2జీ స్కామ్‌కు సంబంధించినట్టుగా భావించిన లీక్డ్ టేప్స్‌లో నేరపూరిత అంశాలేవీ  లభించలేవని సీబీఐ సుప్రీంకోర్టుకు బుధవారం తెలిపింది. కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియాకు రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులకు మధ్య  జరిగిన సంభాషణల్లో నేరపూరిత అంశాలు లేవని వివరించింది.

దశాబ్దం క్రితం జరిగిన దర్యాప్తులో భాగంగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నీరా రాడియాకు, ఆమె క్లయింట్లకు సంబంధించిన సుమారు 8000 ఫోన్ సంభాషణలను రికార్డు చేసింది. వీటిని విచారించడానికి సీబీఐ 14 ప్రాథమిక దర్యాప్తులను చేపట్టింది. కోర్టు ఆదేశించిన మేరకు చేపట్టిన దర్యాప్తునకు సంబంధించిన ఫలితాన్ని సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్‌లో అందించినట్టు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాతి తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అంశాన్ని కోర్టు టేకప్ చేయలేదని పేర్కొన్నారు. 

ఇప్పుడు సీబీఐ అన్ని 14 ప్రాథమిక దర్యాప్తులను క్లోజ్ చేసింది. ఇందులో నుంచి ఒక్కటి కూడా కేసుగా నమోదు కాలేదు.

కేవలం తొమ్మిది ఏళ్ల కాలంలో నీరా రాడి రూ. 300 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నీరా రాడియా నిర్మించారని, ఆమె పన్ను ఎగవేశారనే ఆరోపణలతో కేంద్ర ఆర్థిక శాఖకు 2007 నవంబర్ 16న ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ నీరా రాడియా ఫోన్‌పై సర్వెలెన్స్ పెట్టింది. ఇందులో భాగంగానే ఆమె ఫోన్ సంభాషణలను రికార్డు చేసింది. ఆమె ఫోన్ సంభాషణల లీక్డ్ విషయం బయటకు రాగానే.. వైష్ణవి కార్పొరేట్ కమ్యూనికేషన్స్, దాని ఇతర అనుబంధ సంస్థల పీఆర్ బిజినెస్‌ను ఆమె క్లోజ్ చేసింది. ఆమె క్లయింట్లలో టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి.

రాడియా ఆడియో టేప్‌లను దర్యాప్తు చేయాలని, ఇందులో తన వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగిందని రతన్ టాటా ఓ రిట్ పిటిషన్ వేయడం గమనార్హం.

click me!