అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోనియా, రాహుల్ గాంధీల అనుమతి అవసరం లేదు: కాంగ్రెస్

By Mahesh RajamoniFirst Published Sep 21, 2022, 2:24 PM IST
Highlights

Congress: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోనియా గాంధీ, రాహుల్ అనుమతి అవసరం లేదని ఆ పార్టీ వెల్ల‌డించింది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమోదముద్ర వేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు  జైరాం రమేష్ అన్నారు. 
 

Congress presidential election: వచ్చే నెలలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరికీ అనుమతి అవసరం లేదని ఆ పార్టీ బుధవారం పేర్కొంది. గత లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తూ అప్ప‌టి చీఫ్ రాహుల్ గాంధీ అధ్యక్ష ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీతో సోనియా గాంధీ తాత్కాలిక అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అప్ప‌టి నుంచి పార్టీని న‌డిపించే నాయ‌క‌త్వ లేమితో ఇబ్బందులు ప‌డుతోంది. ప‌లుమార్లు రాహుల్ గాంధీనే మ‌ళ్లీ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ శ్రేణులు ఆయ‌న‌పై ఒత్తిడిని తీసుకువ‌చ్చాయి. అయితే, రాహుల్ గాంధీ దీనికి నో చెప్ప‌డంతో.. అధ్య‌క్షుని ఎన్నుకోవ‌డానికి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ ఏర్పాట్లు సిద్ధం చేసింది. 

ప్ర‌స్తుతం కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో దేశవ్యాప్త‌ భార‌త్ జోడో యాత్ర కొన‌సాగుతోంది. భారత్ జోడో యాత్ర మొదటి, రెండో విడత మధ్య విరామం సందర్భంగా ఏఐసీసీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ మీడియాతో మాట్లాడుతూ..  "కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి అంద‌రికీ స్వేచ్ఛ ఉంటుంది. 10 మంది పీసీసీ ప్ర‌తినిధుల నుంచి మ‌ద్ద‌తు ఉన్న వారు ఎవ‌రైనా ఎన్నికల్లో పోటీ చేయ‌వ‌చ్చు.. నామినేషను దాఖలు చేయడానికి ఎవరికీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ అనుమతి అవసరం లేదు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతాయి. దేశంలోని ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా తమ పార్టీ అధినేతను ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించదు" అని పేర్కొన్నారు. 

అదే సమయంలో, కామరాజ్ నమూనా ప్రకారం ఏకాభిప్రాయం ఆధారంగా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడాన్ని తాను విశ్వసిస్తున్నానని జైరాం రమేష్ చెప్పారు. లెజెండరీ కాంగ్రెస్ నాయకుడు కే. కామరాజ్ అభిప్ర‌యాన్ని పంచుకుంటూ.."ప్రతి ఒక్కరితో మాట్లాడండి.. పార్టీని నడిపించడానికి తగిన ఏకాభిప్రాయ ఎంపికను కనుగొనండి" అని అన్నారు. 'ఏకాభిప్రాయం కుదరకపోతే ఎన్నికలు వాంఛనీయం. మేము ఎన్నికలు నిర్వహించడానికి దూరంగా ఉండటం లేదు" అని ఆయన అన్నారు. అలాగే, ఎవరు బరిలోకి దిగుతారనే దానిపై రమేష్‌ మాట్లాడుతూ, ఎవరు పోటీ చేస్తారో తనకు తెలియదనీ, అయితే తాను మాత్రం పోటీ చేయడం లేద‌ని చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేస్తారో లేదో తనకు తెలియదని, అలా చేస్తే ఆ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో కూడా తెలియదని అన్నారు.

అయితే, ఎలాంటి పరిస్థితులను అయిన‌ ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యవస్థ ఉందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ప్ర‌ణాళికల గురించి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం భార‌త్ జోడో యాత్ర‌లో బిజీగా ఉన్నార‌ని తెలిపారు. సెప్టెంబర్ 23 యాత్రకు విశ్రాంతి రోజు అని, అందువల్ల, ఆయ‌న ఢిల్లీకి వెళితే, ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న త‌న త‌ల్లిని క‌ల‌వ‌నున్నార‌ని వెల్ల‌డించారు. "రాహుల్ గాంధీ గత 2-3 వారాలుగా తన తల్లిని కలవలేదు. ఆయ‌న కూడా ఒక మ‌నిషే.. మీ అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోతే మీరు వెళ్లి ఆమెను కలుసుకోరా? ఇప్పుడు నా వద్ద ఉన్న సమాచారం ప్రకారం, అతను ఢిల్లీకి వెళితే, అది అనారోగ్యంతో ఉన్న ఆయ‌న‌ తల్లిని కలవడానికి ఉంటుంది. పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌ల‌లో నామినేషన్ దాఖలు చేయడానికి కాదు" అని జైరాం రమేష్ చెప్పారు. కాగా, కాంగ్రెస్ అధ్య‌క్ష పోటీలో సీనియ‌ర్ నాయ‌కులు అశోక్ గెహ్ల‌ట్, శ‌శి థ‌రూర్ పేర్లు వినిపిస్తున్నాయి.

click me!