లైంగిక వేధింపుల కేసు.. కేరళ మజీ సీఎం ఉమెన్ చాందీకి సీబీఐ క్లీన్ చిట్..!

By Sumanth KanukulaFirst Published Dec 28, 2022, 3:57 PM IST
Highlights

కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి భారీ ఊరట లభించింది. ఓ మహిళపై లైంగిక వేధింపుల కేసులో  ఉమెన్ చాండీపై సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. 

కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి భారీ ఊరట లభించింది. ఓ మహిళపై లైంగిక వేధింపుల కేసులో  ఉమెన్ చాండీపై సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. కేరళలో సంచలన సృష్టించిన సోలార్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలైన మహిళ.. ఉమెన్ చాందీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ).. ఉమెన్ చాందీకి క్లీన్ చీట్ ఇస్తూ చీఫ్ తిరువనంతపురం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో నివేదిక సమర్పించింది. సీబీఐ మంగళవారం ఇక్కడి కోర్టులో రిఫరల్ నివేదికను సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

వివరాలు..  కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వ హయాంలో జరిగిన కోట్లాది రూపాయల సోలార్ ప్యానల్ కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న మహిళ ఉమెన్ చాందీపై లైంగిక వేధింపు ఆరోపణలు చేశారు. 2013 జూలై 19న పోలీసు కమిషనర్‌కు రాసిన లేఖలో.. చాందీ, ఆయన మంత్రులు కొందరు, ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులతో సహా పలువురు కాంగ్రెస్, యూడీఎఫ్ నాయకులపై లైంగిక దుష్ప్రవర్తన, అవినీతి ఆరోపణలను మోపారు. ఆ మహిళ ఫిర్యాదు మేరకు కేరళ పోలీసులు  ఉమెన్ చాందీతో సహా ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. మహిళా తన ఫిర్యాదులో 2012లో తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టుగా తెలిపారు. ఈ కేసును కొన్నేళ్లుగా కేరళ క్రైమ్ బ్రాంచ్  పోలీసులు విచారణ చేపట్టారు. అయితే సీపీఎం నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం 2021 ప్రారంభంలో ఈ కేసులపై సీబీఐ విచారణకు సిఫారసు చేసింది.

అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ చర్యను రాజకీయ ప్రేరేపిత చర్య అని పేర్కొంది. ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం తమ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ఏమీ చేయలేకపోయిందని..  ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకుందని అప్పట్లో ఆరోపించింది.

ఇదిలా ఉంటే.. సోలార్ కుంభకోణంలో ఆరోపణలు నిందితురాలిగా ఉన్న మహిళ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణకు సంబంధించి ఉమెన్ చాందీ, మాజీ కేంద్ర మంత్రి కేసీ వేణుగోపాల్, ఇతర రాజకీయ నాయకులపై కేసుల సీబీఐ దర్యాప్తుకు స్వీకరించింది. అయితే ఇందుకు సంబంధించి విచారణ చేపట్టిన సీబీఐ.. పలు విషయాలను కోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రస్తావించింది. 

మహిళ చెప్పినట్టుగా ఉమెన్ చాందీ ఆ రోజున అప్పటి ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వెళ్లినట్లు రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లేనందున.. ఆయనపై  నమోదైన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ విచారణలో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది కల్పిత కేసు అని సీబీఐ కూడా గుర్తించిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

click me!