భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ భద్రతపై కాంగ్రెస్ ఆందోళన.. కేంద్రానికి లేఖ..

By Sumanth KanukulaFirst Published Dec 28, 2022, 3:19 PM IST
Highlights

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భద్రతపై ఆ పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర భద్రతలో అనేక ఉల్లంఘనలు జరిగాయని లేఖలో పేర్కొంది. రాహుల్ గాంధీకి సరైన రక్షణ కల్పించాలని కోరింది.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భద్రతపై ఆ పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర భద్రతలో అనేక ఉల్లంఘనలు జరిగాయని లేఖలో పేర్కొంది. రాహుల్ గాంధీకి సరైన రక్షణ కల్పించాలని కోరింది. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ రాసిన ఈ లేఖలో..  డిసెంబర్ 24న భారత్ జోడో యాత్ర ఢిల్లీలోకి ప్రవేశించినప్పటి నుంచి యాత్రకు సంబంధించి భద్రతపై పలుమార్లు రాజీ పడ్డారని పేర్కొన్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న రాహుల్ గాంధీ చుట్టూ పెరుగుతున్న జనాన్ని నియంత్రించడంతో ఢిల్లీ పోలీసులు పూర్తిగి విఫలమయ్యారని ఆరోపించారు. కాగా, ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తారనే సంగతి తెలిసిందే. 

ఢిల్లీ పోలీసులు భద్రత ఉల్లంఘనలు జరుగున్న సమయంలో మూగ ప్రేక్షక పాత్ర పోషించడంతో.. పార్టీ కార్యకర్తలు రాహుల్ గాంధీకి చుట్టూ వలయాన్ని ఏర్పాటు చేశారని కేసీ వేణుగోపాల్ లేఖలో పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో యాత్రలో నడుస్తున్న ప్రజలను ప్రశ్నిస్తోందని అన్నారు. ప్రతి భారతీయుడికి ఎటువంటి ఆటంకం లేకుండా దేశమంతటా తిరిగే హక్కు ఉందని ప్రస్తావించారు.  ‘‘భారత్ జోడో యాత్ర దేశంలో శాంతి, సామరస్యాన్ని తీసుకురావడానికి చేసిన పాదయాత్ర. ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడకూడదు. కాంగ్రెస్ నాయకుల భద్రత మరియు భద్రతకు హామీ ఇవ్వాలి’’ అని కేసీ వేణుగోపాల్ లేఖలో కోరారు. రాహుల్‌ గాంధీకి  మెరుగైన భద్రతను కోరుతూ.. కాంగ్రెస్ నేతలు, మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ సహా పలువురు హత్యలను కూడా లేఖలో ప్రస్తావించారు.

‘‘భారత్ జోడో యాత్ర తిరిగి 2023 జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే తదుపరి దశలో సున్నితమైన రాష్ట్రమైన పంజాబ్‌తో పాటు జమ్మూ కశ్మీర్‌ల గుండా సాగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భద్రత, భారత్‌ జోడో యాత్రలో పాల్గొనే యాత్రికులు, నాయకులందరికి భద్రతను  నిర్ధారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను’’ అని లేఖలో పేర్కొన్నారు. 

click me!