జార్ఖండ్ జడ్జి హత్య కేసు: సమాచారం ఇస్తే రూ.5 లక్షల రివార్డు.. సీబీఐ కీలక ప్రకటన

By Siva KodatiFirst Published Aug 15, 2021, 6:58 PM IST
Highlights

ధన్‌బాద్‌ జిల్లా కోర్టు అదనపు సెషన్స్‌ జడ్జి జస్టిస్‌ ఉత్తమ్‌ ఆనంద్‌‌ హత్య కేసులో సమాచారం ఇచ్చిన వారికి రూ.5లక్షల రివార్డు ఇస్తామని సీబీఐ ఆదివారం ప్రకటించింది.  మరోవైపు ఝార్ఖండ్ హైకోర్టు ఈ కేసును త్వరగా విచారించాలని సీబీఐని ఆదేశించింది. దీనికి అవసరమైన డాక్యుమెంట్లను సీబీఐకి అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఝార్ఖండ్‌ జడ్జి జస్టిస్‌ ఉత్తమ్‌ ఆనంద్‌ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. దీనికి సంబంధించి సమాచారం ఇచ్చిన వారికి రూ.5లక్షల రివార్డు ఇస్తామని సీబీఐ ఆదివారం ప్రకటించింది. హత్యకు సంబంధించిన సమాచారం తెలిసినవారు కార్యాలయానికి వచ్చి తెలియజేయవచ్చని వెల్లడించింది. అలాగే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం అని సీబీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read:జార్ఖండ్ జ‌డ్జి హ‌త్య‌ కేసు.. రంగంలోకి సీబీఐ, ధన్‌బాద్‌కి ప్రత్యేక బృందాలు

కాగా, ధన్‌బాద్‌ జిల్లా కోర్టు అదనపు సెషన్స్‌ జడ్జి జస్టిస్‌ ఉత్తమ్‌ ఆనంద్‌ను ఆగస్టు 4న గుర్తుతెలియని వ్యక్తులు ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. తొలుత హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు తర్వాత సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి రావడంతో హత్యగా నిర్థారించారు. దీంతో ఝార్ఖండ్ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేసింది. కానీ, ఆ తర్వాత సీబీఐకు సిఫార్సు చేసింది.

ఈ కేసులో ఆటో డ్రైవర్ లఖన్ వర్మ, అతడి సహచరుడు రాహుల్ వర్మతో సహా మొత్తం 17 మందిని అరెస్టు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు పడలేదు. మరోవైపు ఝార్ఖండ్ హైకోర్టు ఈ కేసును త్వరగా విచారించాలని సీబీఐని ఆదేశించింది. దీనికి అవసరమైన డాక్యుమెంట్లను సీబీఐకి అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలోని న్యాయాధికారులకు భద్రత కల్పించేలా వారి ఇళ్ల వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అలాగే జడ్జి హత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు ఆలస్యం ఎందుకు జరిగిందో కోర్టుకు చెప్పాలని ఆదేశించింది. 
 

click me!