సోషల్ మీడియాలో వలపు వల.. బిల్డర్ నుంచి రూ. 80వేల లూటీ

By telugu teamFirst Published Aug 15, 2021, 6:49 PM IST
Highlights

సోషల్ మీడియాలో పరిచయమైన ఓ మహిళ, ఆమె ముగ్గురు సహచరులు 30ఏళ్ల బిల్డర్‌కు రూ. 80వేల కుచ్చుటోపీ పెట్టారు. మహారాష్ట్రలోని పూణెలో ఈ ఘటన జరిగింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పూణె: ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్నట్టే సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి. వర్చువల్ వరల్డ్‌లో వలపు వల విసిరి రియల్ వరల్డ్‌లో జేబులకు చిల్లులు పెడుతున్న ఘటనలు కోకొల్లలు. మహారాష్ట్రలోని పూణెలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. 31ఏళ్ల బిల్డర్‌ను ఓ మహిళ సోషల్ మీడియాలో మీట్ అయింది. చనువు పెరిగింది. ప్రత్యకంగా కలుద్దామంది. శారీరకంగానూ కలిశారు. తర్వాత ఆమె తన సహచరులతో కలిసి బిల్డర్ నుంచి రూ. 80వేలు లాక్కున్నారు. నగదు లేవంటే ఏటీఎంకి తీసుకెళ్లి డ్రా చేసి మరీ లూటీ చేయడం గమనార్హం.

పోలీసుల వివరాల ప్రకారం, ఆ మహిళ, బిల్డర్ సోషల్ మీడియాలో కలుసుకున్నారు. తర్వాత ఒకసారి కలుద్దామని పేర్కొంటూ పూణెకు రమ్మని బిల్డర్‌ను అభ్యర్థించింది. బిల్డర్ ఆమె మాట నమ్మి పూణెకు వెళ్లాడు. ఇరువురూ శారీరకంగా కలిశారు.

బిల్డర్ తన స్వస్థలానికి కారులో తిరిగివెళ్తుండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అడ్డుకున్నారు. కోండ్వా ఏరియాలోని యవలవాడి దగ్గర ఆగస్టు 7న మధ్యాహ్నం 3.30 గంటలకు బిల్డర్‌ కారును ఆపి అతనిపై బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులకు రేప్ చేసినట్టు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. తాము ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఒకవేళ డబ్బులు ఇవ్వకుంటే ఆమెను పెళ్లి చేసుకుంటానని ఓ పేపర్ పై బలవంతంగా రాయించారు. ఆ వైట్ పేపర్‌పై బిల్డర్ సంతకం, వేలిముద్ర తీసుకున్నారు.

బిల్డర్ దగ్గర నుంచి అందుబాటులో ఉన్న రూ. 50వేలను లూటీ చేశారు. అంతేకాదు, సమీపంలోని ఏటీఎంకు తీసుకెళ్లి రూ. 30వేల వరకు డ్రా చేయించారు. ఆ డబ్బులనూ లాక్కున్నారు. మిగిలిన డబ్బులు ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. బిల్డర్ కారులో ఇంటికి చేరే వరకూ డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించారు. అనంతరం, బిల్డర్ కోండ్వా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ మహిళ సహ ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు పెట్టారు. దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

click me!