సీఎం కాన్వాయ్ లో రూ.1.8 కోట్లు పట్టివేత, తెరపైకి ఓటుకు నోటు కేసు

By Nagaraju penumalaFirst Published Apr 3, 2019, 6:26 PM IST
Highlights

బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అరుణాచల్ ప్రదేశ్ లో ఓ ర్యాలీలో పాల్గొనాల్సి ఉంది. ప్రధాని అరుణాచల్ ప్రదేశ్ వస్తారనుకుంటున్న కొద్దిగంటల ముందు జరిగిన ఈ ఘటన కాంగ్రెస్ పార్టీకి ప్రచార అస్త్రంగా మారింది. మోదీ సభకు హాజరయ్యే ప్రజలకు పంచేందుకే డబ్బు తరలిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
 

ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటన వేళ అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో ఓటుకు నోటు వ్యవహారం సంచలనం రేపుతోంది. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మెయిన్  కాన్వాయ్‌లో రూ.1.8 కోట్లు పట్టుబడ్డాయి. 

రెండు కార్ల నుంచి ఈ నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం అరుణాచల్ ప్రదేశ్ తోపాటు దేశ రాజకీయాల్లోనూ దుమారం రేపుతోంది. బీజేపీ ఓటుకు నోటు కుట్ర బయటపడిందని కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తోంది. 

ప్రధాని నరేంద్రమోదీ, సీఎం, డిప్యూటీ సీఎంలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ తమ ధన బలంతో ఓటర్లకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 

బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అరుణాచల్ ప్రదేశ్ లో ఓ ర్యాలీలో పాల్గొనాల్సి ఉంది. ప్రధాని అరుణాచల్ ప్రదేశ్ వస్తారనుకుంటున్న కొద్దిగంటల ముందు జరిగిన ఈ ఘటన కాంగ్రెస్ పార్టీకి ప్రచార అస్త్రంగా మారింది. మోదీ సభకు హాజరయ్యే ప్రజలకు పంచేందుకే డబ్బు తరలిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

మరోవైపు బీజేపీ నేతల కాన్వాయ్‌లో భారీ మొత్తంలో డబ్బులు తరలిస్తున్నట్లు మంగళవారం రాత్రి కాంగ్రెస్ నేతలకు సమాచారం అందింది. దాంతో ఓ కార్యకర్త అరుణాల్ ప్రదేశ్ సీఎం కాన్వాయ్‌ని ఫాలో అయ్యాడు. 

ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌కు సమాచారం ఇవ్వడంతో అధికారులు సైతం వెంబడించారు. పాసీఘాట్‌లోని సియాంగ్ గెస్ట్‌హౌస్ వద్ద ఎన్నికల అధికారులు కాన్వాయ్ లోని కార్లన్నింటిని తనిఖీలు చేశారు.  

మెబో నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి దంగీ పెర్మి కారులో రూ.కోటి రూపాయలు దొరికాయి. డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ ఉపయోగిస్తున్న రవాణాశాఖకు చెందిన కారులో మరో. 80 లక్షలు పట్టుబడ్డాయి. ఆ సమయంలో సీఎం పెమాఖండు, డిప్యూటీ సీఎం చౌనా గెస్ట్‌హౌస్ లోనే ఉండటం గమనార్హం. 


ఏకంగా సీఎం కాన్వాయ్‌లో భారీ మొత్తంలో డబ్బులు పట్టుబడడంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ దొరికినా ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేత రణ్‌దీప్ సూర్జివాలా. 

అయితే కాంగ్రెస్ ఆరోపణలను అరుణాచల్ సీఎం పెమా ఖండు ఖండించారు. ఓటుకు నోట్లిచ్చే బుద్ధి తమకు లేదని అది కాంగ్రెస్ నేతలకే చెల్లిందంటూ ఎదురుదాడికి దిగారు. బీజేపీ కార్యకర్తకు చెందిన కారులో డబ్బులు దొరికాయి అయితే ఆ డబ్బులతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 

ఆ డబ్బు మెబో బీజేపీ అభ్యర్థి దండీ పర్మీ, మాజీ ఎమ్మెల్యేకు చెందినవని వాటితో సీఎంకు గానీ తనకు గానీ ఎలాంటి సంబంధం లేదని డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ స్పష్టం చేశారు. మోదీ పర్యటన వేళ ఈ వ్యవహారం అరుణాల్ ప్రదేశ్ రాజకీయాల్లో అగ్గిరాజేస్తోంది. డబ్బులతో ఓట్లను కొంటోందని బీజేపీపై మండిపడుతోంది కాంగ్రెస్. ఎన్నికలకు వారం రోజుల ముందు జరిగిన ఈ ఘటన బీజేపీపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.  

click me!