యాపిల్ ఉద్యోగి కాల్చివేతపై ట్వీట్లు: కేజ్రీవాల్ పై కేసు నమోదు

By Nagaraju TFirst Published Oct 1, 2018, 5:03 PM IST
Highlights

 ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మరో కేసులో ఇరుక్కున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కేజ్రీవాల్‌ కామెంట్‌ చేశారన్న అభియోగాలతో ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్ పై కేసు నమోదు చేశారు. 

ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మరో కేసులో ఇరుక్కున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కేజ్రీవాల్‌ కామెంట్‌ చేశారన్న అభియోగాలతో ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్ పై కేసు నమోదు చేశారు. 

వివరాల్లోకి వెళ్తే యాపిల్‌ సంస్థ మేనేజర్‌ వివేక్‌ తివారిని శుక్రవారం ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు కాల్చి చంపారు. వివేక్ తివారిని కాల్చిచంపడంపై కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. వివేక్ తివారీ హిందువే కదా.. మరి అతన్ని ఎందుకు చంపినట్టు. బీజేపీ ఎంత మాత్రం హిందువుల శ్రేయోభిలాషి కాదనేది వరుస ఘటనలతో స్పష్టమవుతోందని ఆరోపించారు. 

యూపీలో జరుగుతున్నవి బూటకపు ఎన్‌కౌంటకర్లని, బీజేపీ హిందువులకు రక్షణ కల్పించడంలో తీవ్రంగా విఫలమైందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. బీజేపీ నేతలు హిందూ యువతులను లైంగికంగా వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అధికారం కోసం హిందువులను చంపాల్సి వస్తే వారు రెండో ఆలోచన చేయరంటూ హిందీలో పోస్ట్ చేస్తూ విమర్శల వర్షం గుప్పించారు. 

కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అధికార ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్‌ 153ఎ, 295ఎ సెక్షన్‌ల కింద కేజ్రీవాల్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

మరోవైపు వివేక్‌ తివారిని ఎలాంటి కారణం చూపకుండా యూపీ పోలీసులు కాల్చిచంపడంపై యూపీలో వివాదం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. నకిలీ ఎన్‌కౌంటర్లకు బాధ్యత వహిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తన పదవికి రాజీనామా చేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 

click me!