hate speech: ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ హరిద్వార్‌లో విద్వేష ప్రసంగం.. కేసు నమోదు

By Mahesh KFirst Published Dec 24, 2021, 12:56 AM IST
Highlights

హరిద్వార్‌లో జరిగిన ఓ మతపరమైన వేడుక ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ వేడుకలో కొందరు ఒక వర్గాన్ని లక్ష్యం చేసుకుని మాట్లాడారు. ఆ వర్గాన్ని అంతమొందించాలనే విద్వేషపూరిత వ్యాఖ్యలూ చేశారు. ఈ కార్యక్రమానికి చెందని కొన్ని వీడియోలో సోషల్ మీడియాలో వైవరల్ అయ్యాయి.
 

న్యూఢిల్లీ: వివాదాస్పద మత గురువు యతీనర్సింఘానంద్(Yathi Narsinghanand) మరో వివాదానికి కేంద్ర బిందువయ్యారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌(Haridwar)లో ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన ‘ధర్మ సంసద్’ కార్యక్రమం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో విద్వేష ప్రసంగాలు(Hatefull speech) చేశారు. ముస్లింలపై యుద్ధం ప్రకటించాలని, కత్తులు కాదు.. మరింత పవర్‌ఫుల్ వెపన్స్ చేతబట్టాలని పిలుపు ఇచ్చారు. ఆ వర్గాన్ని మొత్తం నిర్మూలించాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలూ చేశారు. 2029లో ఒక ముస్లిం ప్రధాన మంత్రి కాకుండా ఉండాలంటే యుద్ధానికి సిద్ధం కావాలనే పిలుపు ఇచ్చారు. అయితే, ఈ కార్యక్రమంలో వారు చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీంతో ఈ వీడియోలపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. చాలా వర్గాలకు చెందిన నెటిజన్లు ఈ వీడియోలను ఖండించారు. ఈ వీడియోలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఊచకోతకు పిలుపు ఇస్తుంటే చర్యలు తీసుకోవడం లేదని, మునాఫర్ ఫరూకీ జోక్ పేల్చకుండానే జైలు పాలు కావాల్సి వచ్చిందని నెటిజన్లు ఆగ్రహించారు. ఒక దేశం.. రెండు నీతులా అంటూ విమర్శలు చేశారు. ఇదే విషయాన్ని పోలీసుల ముందు ప్రస్తావిస్తే.. తమకు ఫిర్యాదు అందలేదని, అందుకే ఇంకా కేసు నమోదు కాలేదని హరిద్వార్ ఎస్పీ స్వతంత్ర కుమార్ సింగ్ వివరించారు. తృణమూల్ కాంగ్రెస్ నేత, ఆర్టీఐ యాక్టివిస్ట్ సాకేత్ గోఖలే ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసులో జితేంద్ర నారాయణ్ త్యాగి అలియాస్ వాసీం రజ్వీ పేరు ఉన్నది. ఈయన ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్‌గా పని చేశారు. ఈయన ఒక్కరి పేరుతోపాటు ‘ఇతరులు’ అనే వారిపై కేసు నమోదైంది.

Also Read: ఈ నెల 14న రాకపోతే అరెస్ట్ వారంట్ జారీ చేస్తాం:అక్బర్‌కి కోర్టు హెచ్చరిక

ఓ వర్గాన్ని ప్రేరేపిస్తూ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నదని, దీనికి సంబంధించి జితేంద్ర నారాయణ్ త్యాగి, ఇతరులపై కేసు నమోదైందని, చర్యలు ప్రారంభించామని పోలీసు అధికారి తెలిపారు. కాగా, ఈ వీడియోలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ కనిపించిన వారు మాత్రం తమ వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నట్టు ఇప్పటికీ వాదిస్తున్నారు. తాను మాట్లాడిన మాటలపై తనలో సంకోచమేమీ లేదని, పోలీసులకూ తాను భయపడనని హిందూ రక్ష సేనాకు చెందిన ప్రబోధానంద్ గిరి పేర్కొన్నారు. మయన్మార్ తరహాలోనే ఇక్కడి పోలీసులు, రాజకీయ నేతలు, ఆర్మీ, ప్రతి హిందువు ఏకం కావాలని, అందరు ఆయుధాలు చేతబట్టాని అన్నారు. వాటితో సఫాయి కార్యక్రమం చేపట్టాలని పరోక్షంగా హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేశారు.

Also Read: బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఫేస్ బుక్ షాక్: ఖాతా తొలగింపు

కాగా, ఈ సమావేశానికి చెందిన మరో వీడియోలో పూజా షకున్ పాండే అలియాస్ సాద్వి అన్నపూర్ణ.. ముస్లింలపై హింసను ప్రేరేపించే మాటలు మాట్లాడారు. వారిని మీరు అంతమొందించాలని భావిస్తున్నారా? వారిని ఒక వేళ పూర్తిగానే లేకుండా చేయాలంటే.. వారిని చంపాలనుకుంటే చంపేయండి అంటూ మాట్లాడారు. తమకు ఒక వంద మంది సైనికులు కావాలని, 20 లక్షల ఆ వర్గాన్ని అంతం చేయడానికి వీరు అవసరం అని పేర్కొన్నారు. అంతేకాదు, భారత రాజ్యాంగం తప్పుగా ఉన్నదని అన్నారు. తాను పోలీసు గురించి భయపడటం లేదని తెలిపారు.

click me!