పార్కింగ్ ఫీజు అడిగారని.. సిబ్బందిపై క్రికెట్ బ్యాట్ తో కారు ఓనర్ వీరంగం.. ఒకరికి తీవ్రగాయాలు..

By SumaBala BukkaFirst Published Feb 3, 2023, 7:14 AM IST
Highlights

బాధితుడి తలకు బలమైన గాయాలు తగిలాయని, ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. 

న్యూఢిల్లీ : నైరుతి ఢిల్లీలో బుధవారం దారుణమైన ఘటన జరిగింది. పార్కింగ్ ఫీజు అడిగారని ఆరోపణతో మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎమ్ సీడీ) కార్ పార్కింగ్ అటెండర్‌ను ఓ కారు యజమాని క్రికెట్ బ్యాట్‌తో నిర్దాక్షిణ్యంగా కొట్టాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సదరు నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

క్రికెట్ బ్యాట్‌తో కొట్టడంతో బాధితుడు వికాస్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని వెంటనే ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ అతను చికిత్స పొందుతున్నాడని అధికారి తెలిపారు. వసంత్ విహార్ పోలీస్ పోస్ట్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

"బుధవారం సాయంత్రం, వసంత విహార్ సమీపంలోని ఎమ్ సీడీ పార్కింగ్ ప్రాంతంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి తన కారును పార్క్ చేసాడు. ఆ సమయంలో పార్కింగ్ అటెండెంట్లు మనోజ్, వికాస్ డ్యూటీలో ఉన్నారు. కారు యజమాని రాత్రి 9.40 గంటలకు తన కారును తీయడానికి వచ్చాడు. అప్పటికే అతను తాగి ఉన్నాడు.  తన స్నేహితుడితో కలిసి మద్యం మత్తులో కారు దగ్గరికి వచ్చాడు. 

బాల్య వివాహాలపై అస్సాం ప్రభుత్వం కఠిన చర్యలు.. సీఎం హిమంత బిస్వా శర్మ కీలక ఆదేశాలు

పార్కింగ్ అటెండెంట్ మనోజ్ రూ. 60 పార్కింగ్ ఫీజు చెల్లించమని అడిగాడు. దీంతో కారు యజమాని అతని మీద తిట్ల దండకం మొదలుపెట్టాడు. పార్కింగ్ ఫీజు ఇవ్వకపోతే.. పార్కింగ్ కాంట్రాక్టర్ ఆ డబ్బులు తన జీతంలో కట్ చేసుకుంటాడని మనోజ్ కారు యజమానిని బతిమిలాడాడు. మరో పార్కింగ్ అటెండెంట్ వికాస్ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించాడు. సడెన్ గా, కారు యజమాని తన కారులో నుండి బ్యాట్ తీసి పార్కింగ్ అటెండర్లపై దాడి చేసాడు. ఇద్దరూ పోలీస్ బూత్ వైపు దూసుకుపోయారు.

కారు యజమాని వికాస్ తలపై కొట్టాడు. అతను కింద పడిపోయాడు. కిందపడ్డ వికాస్ తలపై దెబ్బమీద దెబ్బ కొడుతూ పోయాడు’ అని ఎఫ్ఐఆర్ లో నమోదయ్యింది. 

వసంత్ విహార్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 308 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. "ఘటనాస్థలం నుండి సిసిటివి ఫుటేజీని సేకరించాం. కారు, ఈ సంఘటనలో ఉన్న మరో వ్యక్తి గురించి వివరాలు సేకరించడానికి దానిని స్కాన్ చేస్తున్నాం" అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

ఈ దాడికి సంబంధించి ఓ పాఠశాలలో పీటీ టీచర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు. "కేసుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అతన్ని విచారించనున్నారు" అని అధికారి తెలిపారు.

click me!