అమరీందర్ సింగ్ కొత్త పార్టీ.. కాంగ్రెస్‌లో కలవరం.. ‘బీజేపీతో సీట్ల ఒప్పందం.. సిద్దూను ఓడిస్తా’

By telugu teamFirst Published Oct 27, 2021, 12:42 PM IST
Highlights

పంజాబ్‌లో మరో పరిణామం ముందుకు వచ్చింది. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ధ్రువీకరించారు. పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై ఈసీ క్లియరెన్స్ రాగానే వెల్లడిస్తామని తెలిపారు.  రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తామని, బీజేపీతో సీట్లను పంచుకునే ఒప్పందంలో ఉంటుందని వివరించారు. తమ వెంట చాలా మంది కాంగ్రెస్ నేతలు ఉన్నారని, రాష్ట్రంలో 117 సీట్లలో పోటీ చేస్తామని తెలిపారు. నవ్‌జోత్ సింగ్ సిద్దూ ఎక్కడి నుంచి పోటీ చేసినా.. తాము పోరాడతామని స్పష్టం చేశారు.
 

చండీగడ్: Punjabలో రాజకీయ రగడ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. Congressలో అంతర్గత విభేదాలతో రాష్ట్ర రాజకీయాలే ఒక్కసారిగా మారిపోయాయి. Navjot Singh Sidhu రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా ఎన్నికవడం.. Captain Amarinder Singh సీఎం పదవికి రాజీనామా చేయడం.. కొత్త సీఎంగా దళిత ఎమ్మెల్యే చన్నీని ఎంపిక చేయడం చకచకా జరిగిపోయాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ వీడినా.. నవ్‌జోత్ సింగ్‌కు కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు మధ్య విబేధాలు మరింత పెరిగాయి. ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయిన తర్వాతే అమరీందర్ సింగ్ New Political Party ఏర్పాటు చేస్తారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా అమరీందర్ సింగ్ విలేకరులో సమావేశంలో కొత్త పార్టీపై స్పష్టతనిచ్చారు.

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే లోపే తాను కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. అయితే, పార్టీ పేరు ఇంకా ఖరారు కాలేదని వివరించారు. దానిపై తమ లాయర్లు ఇంకా పనిచేస్తున్నారని వివరించారు. పార్టీ పేరు, ఎన్నికల గుర్తు కోసం ఎలక్షన్ కమిషన్‌కు దరఖాస్తు చేశామని, వాటిపై ఈసీ క్లియరెన్స్ రాగానే ఆ వివరాలు తెలియజేస్తామని చెప్పారు. కొత్త పార్టీ వైఖరినీ చూచాయగా ఆయన వెల్లడించారు.

Also Read: అమరీందర్‌పై 78 మంది ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదు.. అందుకే తొలగింపు : కాంగ్రెస్ కీలక ప్రకటన

అమరీందర్ సింగ్ కొత్త పార్టీ బీజేపీతో కుమ్మక్కై ఉంటుందని నవ్‌జోత్ సింగ్ సిద్దూ ఇది వరకే ఆరోపణలు చేశారు. వాటిని ఖండిస్తూ కెప్టెన్ వివరణ ఇచ్చారు. తాను ఏర్పాటు చేసే కొత్త పార్టీ.. బీజేపీతో పొత్తులో ఉండదని స్పష్టం చేశారు. అయితే, సీట్ల పంపకాలపై ఒప్పందం ఉంటుందని వివరించారు. అలాగే, అకాలీలతో పొత్తు ఉండబోదని విస్పష్టంగా వివరించారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 117 సీట్ల నుంచీ తాము పోటీ చేస్తామని, తమ వెంట చాలా మంది కాంగ్రెస్ నేతలు ఉన్నారని చెప్పారు. పార్టీ ప్రకటించిన తర్వాత వారి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. నవ్‌జోత్ సింగ్ సిద్దూ ఎక్కడి నుంచి పోటీ చేసినా తాము ఆయనపై పోరాడతామని వివరించారు. సిద్దూ పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పాపులారిటీ 25శాతానికి పడిపోయిందని అన్నారు.

Also Read: నన్ను సీఎం చేసి ఉంటే సక్సెస్ ఏంటో చూపెట్టేవాడ్ని.. ఈ సీఎం కాంగ్రెస్‌ను ముంచుతాడు.. వీడియోకు చిక్కిన సిద్దూ

కెప్టెన్ అమరీందర్ సింగ్ విలేకరుల సమావేశంపై కాంగ్రెస్ కలవరపడ్డట్టు తెలుస్తున్నది. అమరీందర్ సింగ్ మీడియా అడ్వైజర్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం ఆహ్వానాలు పంపగానే కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది. వెంటనే రాష్ట్రంలోని కీలక నేతలతో మాట్లాడింది. కనీసం ఐదు ఎమ్మెల్యేలను రాహుల్ గాంధీ ఢిల్లీకి రమ్మన్నట్టు తెలిసింది. ఢిల్లీలో వీరితో వేర్వేరుగా సమావేశం కాబోతన్నట్టు సమాచారం.

పంజాబ్‌లో మిలిటరీ జ్యూరిస్‌డిక్షన్ పెంచడాన్ని కెప్టెన్ అమరీందర్ సింగ్ సమర్థించారు. రాష్ట్రంలోకి ఒకప్పుడు డ్రోన్‌లు డ్రగ్స్, ఆయుధాలు మోసుకొచ్చేవని, కానీ నేడు పేలుడు పదార్థాలను తెచ్చేదాకా పరిస్థితులు వెళ్లాయని వివరించారు. అయితే, తాను భయపెట్టడం లేదని, వారు చైనా డ్రోన్‌లు ఉపయోగిస్తున్నారని, అవి చండీగడ్ వరకూ వచ్చే సామర్థ్యం కలిగి ఉండగలవని అన్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేసి అప్రమత్తం చేయాలని తెలిపారు. ఖలిస్తానీలు, పాకిస్తానీలు కలిసి రాష్ట్రంలో సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు. సీఎంగా తాను ఏ పనీ చేయలేదనే ఆరోపణలు అర్థం లేనివని కొట్టిపారేశారు. తాము ప్రకటించిన మ్యానిఫెస్టోలోని హామీల్లో 92శాతం పూర్తి చేశామని వివరించారు. మిగిలిన హామీలూ వ్యాట్‌తో ముడిపడి ఉన్నందున పూర్తి  కాలేవని తెలిపారు.

click me!