ఇండియాలో అడ్మిషన్లు కుదరదు.. ఉక్రెయిన్ మెడికల్ విద్యార్ధులకు మరోసారి తేల్చేసిన కేంద్రం

By Siva KodatiFirst Published Sep 15, 2022, 8:31 PM IST
Highlights

ఉక్రెయిన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన వైద్య విద్యార్ధులకు ఇక్కడ అడ్మిషన్లు కుదరదని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 
 

ఉక్రెయిన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చిన మెడికల్ విద్యార్ధులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. వీరికి చట్టపరంగా దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందడం సాధ్యం కాదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు మోడీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేశారు. నీట్‌లో తక్కువ మార్కులు రావడం వల్లే భారతీయ విద్యార్ధులు ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదివేందుకు వెళ్లారని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. అందుచేతే వీరికి ప్రవేశాలు కల్పించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అయితే ఉక్రెయిన్ కళాశాలల అనుమతితో విదేశాల్లో మెడికల్ డిగ్రీని పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తామని సుప్రీంకు తెలియజేసింది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్ధులకు ఎన్ఎంసీ తదితర ప్రభుత్వ ఏజెన్సీలు సహకారం అందిస్తున్నాయని కేంద్రం వెల్లడించింది. శుక్రవారం ఉక్రెయిన్ విద్యార్ధుల కేసును సుప్రీంకోర్టు విచారించనున్న నేపథ్యంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. 

కాగా.. ఉక్రెయిన్ నుండి సుమారు 18 వేల మంది వైద్య విద్యార్ధులు ఇండియాకు తిరిగి వచ్చారు. పలు రాష్ట్రాల నుండి వందల సంఖ్యలో ఉక్రెయిన్ కు వెళ్లి వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఒక్క Kerala రాష్ట్రంలోనే సుమారు 3,900 మంది ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్ధులు ఉక్రెయిన్ లో వైద్య విద్య చదువుతున్నారు. 

supreme court: భారత్‌లో మెడిసిన్‌కు అవకాశమివ్వండి .. మరోసారి సుప్రీంకోర్టుకెక్కిన ఉక్రెయిన్ వైద్య విద్యార్ధులు

అయితే ఢీల్లీ, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్,  రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంబీబీఎస్ విద్యార్ధులు వారి తల్లిదండ్రులు ఈ విషయమై ఆందోళన చేస్తున్నారు. ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన విద్యార్ధులు తమ విద్యను కొనసాగించేందుకు గాను తమ సహాయం చేస్తామని తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. అయితే ఇంతవరకు ఈ విద్యార్ధుల చదువు విషయమై ఇంకా స్పష్టత రాలేదు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు అవకాశం కల్పించాలని విద్యార్ధులు, వారి కుటుంబ సభ్యులు కేంద్రాన్ని కోరుతున్నారు.  
 

click me!