శారీరక సంబంధానికి ముందు ఆధార్, పాన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు

By Sumanth KanukulaFirst Published Aug 30, 2022, 11:43 AM IST
Highlights

ఏకాభిప్రాయంతో శారీరక సంబంధంలో ఉన్న వ్యక్తి తన భాగస్వామి పుట్టిన తేదీని న్యాయపరంగా పరిశీలించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. అధికారిక పత్రాల ప్రకారం మూడు వేర్వేరు పుట్టిన తేదీలను కలిగి ఉన్న భాగస్వామిపై అత్యాచారం చేశాడని ఆరోపించిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది.

ఏకాభిప్రాయంతో శారీరక సంబంధంలో ఉన్న వ్యక్తి తన భాగస్వామి పుట్టిన తేదీని న్యాయపరంగా పరిశీలించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. అధికారిక పత్రాల ప్రకారం మూడు వేర్వేరు పుట్టిన తేదీలను కలిగి ఉన్న భాగస్వామిపై అత్యాచారం చేశాడని ఆరోపించిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి  ఏకాభిప్రాయంతో శారీరక సంబంధం పెట్టుకునే ముందు.. తన భాగస్వామి ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ చూడాల్సిన అవసరం లేదని లేదా పుట్టిన తేదీని ఆమె పాఠశాల రికార్డుల నుండి ధృవీకరించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. 

ప్రాసిక్యూట్రిక్స్‌ వారి సొంత సౌలభ్యానికి అనుగుణంగా పుట్టిన తేదీలను ఇస్తున్నారని పేర్కొన్న నిందితుడికి ఉపశమనం కల్పించింది. అయితే ఈ కేసు విషయానికి వస్తే.. నేరం జరిగిన సమయంలో తాను మైనర్‌ను అని యువతి పేర్కొంది. మొదట ఏకాభిప్రాయ సెక్స్‌లోకి ఆకర్షించబడినప్పటికీ.. ఆ తర్వాత నిందితుడు బెదిరించి అత్యాచారం చేశాడని ఆరోపించింది. 

‘‘మరొక వ్యక్తితో ఏకాభిప్రాయంతో శారీరక సంబంధంలో ఉన్న వ్యక్తి.. అవతలి వ్యక్తి పుట్టిన తేదీని న్యాయపరంగా పరిశీలించాల్సిన అవసరం లేదు. అతను శారీరక సంబంధంలోకి ప్రవేశించే ముందు.. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆమె పాఠశాల రికార్డ్  నుంచి పుట్టిన తేదీని ధృవీకరించాల్సిన అవసరం లేదు’’ అని జస్టిస్ జస్మీత్ సింగ్ గత వారం జారీ చేసిన ఆర్డర్‌లో పేర్కొన్నారు. ‘‘ఆధార్ కార్డ్ ఉంది.. అందులో పుట్టిన తేదీని 01.01.1998గా చూపుతుంది. ఇది దరఖాస్తుదారుడు మైనర్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం లేదని అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి సరిపోతుంది. అయితే పుట్టిన తేదీకి సంబంధించి, ప్రాసిక్యూట్రిక్స్ మూడు వేర్వేరు పుట్టిన తేదీలను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఆధార్ కార్డ్ ఆమె పుట్టిన తేదీని 01.01.1998గా చూపుతుంది. అందువల్ల ఆరోపించిన సంఘటన తేదీల్లో.. ప్రాసిక్యూట్రిక్స్ మేజర్‌గా భావించబడింది’’ అని న్యాయమూర్తి అన్నారు. 

ప్రాసిక్యూట్రిక్స్‌కు అనుకూలంగా భారీ మొత్తంలో డబ్బు బదిలీ చేయడాన్ని గమనించిన కోర్టు.. ప్రాథమికంగా, ఇది హనీ ట్రాపింగ్ కేసుగా అనిపిస్తోందని అభిప్రాయపడింది. అలాగే 2019, 2021లలో జరిగిన సంఘటనలకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి గల అతి జాప్యానికి సంతృప్తికరమైన కారణం ఇవ్వబడలేదని తెలిపింది. ఇతరులపై ప్రాసిక్యూట్రిక్స్ ద్వారా ఇలాంటి ఎఫ్‌ఐఆర్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, అలాగే ఆమె ఆధార్ కార్డు వివరాలను కూడా విచారించాలని పోలీసు కమిషనర్‌ను కోర్టు కోరింది.

‘‘ప్రస్తుత కేసులో కంటికి కనిపించే దానికంటే చాలా ఎక్కువ ఉందని నేను భావిస్తున్నాను. ప్రాసిక్యూట్రిక్స్ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లుగా.. ఆమె 2019 నుంచి దరఖాస్తుదారుతో సంబంధం కలిగి ఉంది. ప్రాసిక్యూట్రిక్స్‌ని దరఖాస్తుదారుడు బ్లాక్‌మెయిల్ చేసి ఉంటే.. తొలినాళ్లలోనే పోలీసులను ఆశ్రయించకుండా ఆమెను నిరోధించేది ఏమీ లేదు’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. నిందితుడిని రూ. 20,000 స్థానిక పూచీకత్తుతో వ్యక్తిగత బాండుపై విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కేసు విచారణకు స్వీకరించినప్పుడల్లా అతను ఎప్పటికప్పుడు పోలీసు స్టేషన్‌లో రిపోర్టు చేసి కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించారు. అలాగే..నిందితుడు దేశం విడిచి వెళ్లరాదని, పాస్‌పోర్టును అప్పగించాలని, అలాగే ఎలాంటి నేరపూరిత చర్యల్లో పాల్గొనవద్దని, కేసుకు సంబంధించిన వారితో కమ్యూనికేట్ చేయవద్దని కూడా కోరింది.

click me!