ఎమ్మెల్యేలు, ఎంపీల భావ ప్రకటన స్వేచ్ఛపై అదనపు ఆంక్షలు విధించవచ్చునా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

By Mahesh KFirst Published Jan 3, 2023, 12:59 PM IST
Highlights

ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల భావ ప్రకటన స్వేచ్ఛపై అదనపు ఆంక్షలు విధించడం కూడదని సుప్రీంకోర్టు తెలిపింది. సాధారణ పౌరులకు సమానంగా వీరికీ భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్ర్య స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, ప్రజా క్షేత్రంలో ఉండే నేతలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచనలు చేసింది.
 

న్యూఢిల్లీ: రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా మంత్రులు వంటి ప్రజా ప్రతినిధులు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి. కానీ, చాలా సార్లు వీరు తమ వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకున్న వైనాలను మన దేశంలో చూస్తూ ఉన్నాం. ప్రజాప్రతినిధులు కావడంతో వారి వ్యాఖ్యలకు ప్రాచుర్యం ఎక్కువ. దీనిపై ప్రత్యర్థి వర్గం నుంచీ నేతలు దాడులు చేస్తూ ఉంటారు. ఇదంతా ఒక వలయంగా మారి వాస్తవ సమస్యలు పక్కకు జరిగిపోతుంటాయి. అందుకే బాధ్యతాయుత స్థానాల్లో ఉండే ప్రజా ప్రతినిధులు తమ వ్యాఖ్యలపై నియంత్రణ పాటించాలని చాలా మంది అనుకుంటారు. వీలైతే వారి భావప్రకటన స్వేచ్ఛపై అదనపు ఆంక్షలు ఉండాలనే అభిప్రాయం కూడా ఉంటుంది. ఇలాంటి అభిప్రాయాలకు సుప్రీంకోర్టు నుంచి సమాధానం వచ్చింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) కింద సాధారణ పౌరులకు సమానంగా పార్లమెంటు సభ్యులు, మంత్రులు, శాసన సభ సభ్యులు కూడా భావ ప్రకటన స్వేచ్ఛను కలిగి ఉంటారని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఈ ప్రజాప్రతినిధులపై అదనపు ఆంక్షలు విధించడం సాధ్యపడదని తేల్చేసింది. న్యాయమూర్తులు ఎస్ అబ్దుల్ నజీర్, ఏఎస్ బోపన్నా, బీఆర్ గవాయ్, వీ రామసుబ్రమణ్యన్, బీవీ నాగరత్నలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. ఆర్టికల్ 19(2) పేర్కొంటున్నదానికి అతీతంగా సాధారణ పౌరులకు వర్తించేవాటికి అదనంగా ప్రజాప్రతినిధులపై ఆంక్షలు విధించలేమని వివరించింది.

Also Read: POK ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోగలదా..? ఎయిర్ వైస్ మార్షల్ (రిటైర్డ్) బీకే మురళితో

ఒక మంత్రి ప్రభుత్వానికి లేదా దాని వ్యవహారాలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలను కూడా వికారంగా ప్రభుత్వానికే ఆపాదించకూడదని వివరించింది.

వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన వంటి స్వేచ్ఛలు పౌరులకు అవసరమైన సమాచారాన్ని పొందడానికీ ఉఫయోగపడుతుందని, పాలనపైనా అవగాహన పెంచుతుందని, ఫలితంగా అది విద్వేష ప్రసంగంగా మారకుండా ఉపయోగపడుతుందని జస్టిస్ బీవీ నాగరత్న వివరించారు. 

ఓ గ్యాంగ్ రేప్ కేసు బాధితులపై యూపీ మాజీ మినిస్టర్ ఆజాం ఖాన్ చేసిన వ్యాఖ్యలతో ముడిపడి ఈ కేసు ఉన్నది. 2016 జులైలో బులంద్ షెహర్ హైవే సమీపంలో భార్య, కూతురిపై గ్యాంగ్ రేప్ జరిగిన తర్వాత ఆ కేసును ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్ చేయాలని ఆ కుటుంబ యజమాని కేసు వేశాడు. ఆ గ్యాంగ్ రేప్ కేసు రాజకీయ కుట్ర అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆజం ఖాన్ పైనా కేసు పెట్టాలని ఆయన పిటిషన్ వేశారు.


వీటిని విచారిస్తుండగా ప్రజా క్షేత్రంలో ఉన్న నాయకులు వారికి వారుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా స్వీయనియంత్రణ పాటించాలని, రాతపూర్వకంగా లేని నిబంధన పాటించాలని సూచించారు. రాజకీయ, పౌర జీవితాల్లోకి ఈ సూత్రం బలంగా వెళ్లాలని ధర్మాసనం పేర్కొంది.

ప్రజా జీవితంలో ఉన్నవారు స్వీయ నియంత్రణ నిబంధనలను పాటించుకోవాల్సిన అవసరం ఉన్నదని జస్టిస్ నాగరత్న తెలిపారు.

click me!