కాంగ్రెస్‌కు మరో షాక్.. అలాగైతే సీఎంగా కొనసాగలేనంటున్న పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్!

By telugu teamFirst Published Sep 18, 2021, 12:30 PM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలినట్టు తెలిసింది. ప్రస్తుత సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇలాంటి అవమానాలు చాలు.. ఇంకా పార్టీలో కొనసాగలేనని, సీఎం పీఠం నుంచి తప్పుకుంటానని అధ్యక్షురాలు సోనియా గాంధీకి విన్నవించుకున్నట్టు తెలిసింది. నవ్‌జోత్ సింగ్ సిద్దూ నిర్వహించినున్న సీఎల్పీ సమావేశం నుంచి తనను పక్కనపెట్టడాన్ని ఇక సహించలేనని, పార్టీ సమావేశాల్లో తనకు సముచిత స్థానమివ్వకుంటే సీఎంగా తప్పుకుంటానని చెప్పినట్టు కొన్నివర్గాలు వివరించాయి.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతున్నది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఒక్కో రాష్ట్రంలో నేతల మధ్య విభేదాలను పరిష్కరించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ చర్యలు విఫలమవుతున్నట్టుగానే కనిపిస్తున్నది. పంజాబ్‌లో తాజాగా భారీ షాక్ తగలనున్నట్టు తెలుస్తున్నది. ఏకంగా ముఖ్యమంత్రే పార్టీలో ఇక కొనసాగలేనని అదిష్టానం ముందు గోడు వెల్లబోసుకున్నట్టు సమాచారం. పార్టీ సమావేశాల్లో తనను పక్కనపెడితే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇదే జరిగితే కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ పడినట్టేనని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. 

పంజాబ్‌లో కొంతకాలంగా సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వంపై సొంతపార్టీ నుంచే విమర్శలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా నవ్‌జోత్ సింగ్ సిద్దూ నుంచి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వీరిరువురి మధ్య వైరం పతాకస్థాయికి చేరింది. ఇరువురూ అదిష్టానంతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు కావాలని డిమాండ్ చేసే దాకా పరిస్థితులు వెళ్లాయి. అదిష్టానం చొరవ తీసుకుని సిద్దూను శాంతింపజేశాయి. పంజాబ్ కాంగ్రెస్ విభాగానికి చీఫ్ పదవి ఇచ్చి ఉపశమనం చేశాయి. కానీ, ఈ చర్య దీర్ఘకాలిక ఫలితాలనిచ్చినట్టు కనిపించడం లేదు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సిద్దూ ఈ రోజు సీఎల్పీ సమావేశం నిర్వహించాల్సి ఉన్నది. ఇందులో తనను సముచిత స్థానాన్ని ఇవ్వకపోవడంపై సింగ్ అసంతృప్తి చెందినట్టు తెలిసింది. ఇలాగే పార్టీ సమావేశాల్లో తనను పక్కనపెడితే సీఎం పదవి నుంచి వైదొలుగుతానని సోనియా గాంధీకి తెలిపినట్టు సమాచారం. ఈ మీటింగ్ మళ్లీ పాత వివాదాన్నే ముందుకు తెచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకొన్ని నెలలే ఉన్న సందర్బంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పులు జరుగుతాయనే ఊహాగానాలకు తెరలేసింది. ఈ నేపథ్యంలో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అదిష్టానంతో నేరుగా తన గోడు వెల్లబోసుకున్నట్టు తెలిసింది.

‘ఇంతటి అవమానాన్ని నేను భరించలేను. ఈ అవమానాలు ఇక చాలు. ఇది మూడోసారి. ఇలాంటి అవమానాలతో నేను పార్టీలో ఉండాలనుకోవడం లేదు’ అని సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఏకంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మొరపెట్టుకున్నట్టు సంబంధితవర్గాలు తెలిపాయి.

click me!