అసలే కోతి.. ఆపై డబ్బుల బ్యాగు కొట్టేసింది.. ఇంకేముంది నోట్ల వర్షం కురిపించింది.. !

By AN TeluguFirst Published Sep 18, 2021, 10:54 AM IST
Highlights

చెట్టుమీదున్న కోతేమో 500 రూపాయల నోట్లను గాల్లోకి ఎగరేసి రచ్చరచ్చ చేసింది.  స్థానికులు కొందరు ఆ చెట్టు చుట్టూ చేరడంతో దానికి మరింత సరదాగా అనిపించింది.  విచ్చలవిడిగా నోట్ల వర్షం కురిపించింది.  

ఉత్తరప్రదేశ్ : అడవులు నరకడంతో ఊర్లోకి వస్తున్న కోతులు, పంట పొలాలను, ఇంట్లోని వస్తువుల్ని నాశనం చేయడం తెలిసిన విషయమే. ఈ వానరాల బారిన పడితే... అంతే సంగతులు. అయితే ఆశ్చర్యంగా ఓ లాయర్.. కోతుల చేతికి చిక్కి కూడా.. పెద్ద నష్టం లేకుండా బయటపడ్డాడు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి... 

నగదు ఉన్న బ్యాగు చేతిలో పట్టుకుని పక్కనున్న వ్యక్తి తో మాట్లాడుతున్నాడు ఒక అడ్వకేట్. ఇంతలో ఓ వానరం కన్ను ఆ బ్యాగ్ పై పడింది.  అంతే, ఒక్క ఉదుటున ముందుకు ఉరికి... చటుక్కున సంచీని లాక్కుంది. అసలు ఏం జరిగిందో ఆ లాయర్ కు అర్థం అయ్యే లోపే ఆ కోతి బ్యాగుతో సహా  చెట్టు  ఎక్కేసింది. 

ఇక అక్కడి నుంచి మొదలైంది అసలు కథ... కింద ఉన్న లాయర్ ఏమో డబ్బుల కోసం లబోదిబోమంటుంటే… చెట్టుమీదున్న కోతేమో 500 రూపాయల నోట్లను గాల్లోకి ఎగరేసి రచ్చరచ్చ చేసింది.  స్థానికులు కొందరు ఆ చెట్టు చుట్టూ చేరడంతో దానికి మరింత సరదాగా అనిపించింది.  విచ్చలవిడిగా నోట్ల వర్షం కురిపించింది.  ఉత్తరప్రదేశ్లోని రాయపూర్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

ప్రేమ పెళ్లి చేసుకున్నారని.. చంపేసి.. శవాలను రెండు రాష్ట్రాల్లో పడేసి..

కోతి నిర్వాకానికి లాయర్ వినోద్ బాబుకు నోట మాట రాలేదు.  ఆ సమయంలో అక్కడే ఉన్న ఆయన స్నేహితులు ఆ నోట్లను ఏరి ఆయనకు ఇచ్చారు.  అదృష్టవశాత్తు స్థానికులు కూడా నోట్లను ఏరి ఒక చోట చేర్చడంతో బ్యాగ్ లోని సొమ్ములో చాలా మటుకు లాయర్ కు అందింది.  ఆ బ్యాగ్ లో మొత్తం  లక్ష రూపాయలు ఉన్నాయని వినోద్ బాబు తెలిపారు.  అన్ని 500 రూపాయల నోట్లు అని పేర్కొన్నాడు 

కోతి బ్యాగు ఖాళీ చేశాక మొత్తం పదిహేడు నోట్లు మాత్రమే లెక్కలోకి రానట్టు తేలింది. అయితే నష్టం స్వల్ప స్థాయిలో ఉండడంతో వినోద్ సంబరపడిపోయారు. స్థానికులకు, తోటి లాయర్లకు ధన్యవాదాలు తెలిపారు. కోతుల కోసం అని ఆ ప్రాంతంలో ఆహారాన్ని పెడుతుండడంతో పెద్ద సంఖ్యలో కోతుల మంద వచ్చి చేరిందని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలోనే న్యాయవాదికి ఇలాంటి ఊహించని పరిస్థితి ఎదురైందని అంటున్నారు. 

click me!