కశ్మీర్‌లో ఉగ్రవాదానికి మూలం ‘‘బాదం‘’

By Siva KodatiFirst Published Apr 20, 2019, 12:17 PM IST
Highlights

కశ్మీర్ యువతకు భారత్ పట్ల విద్వేషం రగిల్చేందుకు, ఉగ్రవాదం పట్ల ఆకర్షితులయ్యేందుకు ఉగ్రవాద సంస్థలు ఉపయోగిస్తున్న సాధనం ఏంటో తెలుసా డబ్బు, బంగారం కాదు బాదం పప్పు

కశ్మీర్ యువతకు భారత్ పట్ల విద్వేషం రగిల్చేందుకు, ఉగ్రవాదం పట్ల ఆకర్షితులయ్యేందుకు ఉగ్రవాద సంస్థలు ఉపయోగిస్తున్న సాధనం ఏంటో తెలుసా డబ్బు, బంగారం కాదు బాదం పప్పు.

అవును భారత నిఘా సంస్థల దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే అధిక పోషక విలువలకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన కాలిఫోర్నియా బాదంను భారీ రవాణా నెట్‌వర్క్ ద్వారా ఇండో-పాక్ బోర్డర్‌కు చేరవేస్తారు.

అనంతరం వీటిని రకరకాల మార్గాల్లో విక్రయించి తద్వారా వచ్చిన లాభాలను ముష్కరులకు, వేర్పాటు వాదులకు ఉగ్రవాద సంస్థలు అందిస్తున్నట్లుగా తేలింది. ఈ నిధులతో ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, దొంగ నోట్లు భారత్‌లోకి వస్తున్నట్లు గుర్తించారు.

ఈ వ్యాపారంలో ప్రమేయమున్న వారిలో ఎక్కువ మంది నిషేధిత హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన వారే. ఉగ్రవాదానికి ఆకర్షితులైన యువకులు పాక్‌కు వెళ్లి.. అక్కడ టెర్రర్ క్యాంపుల్లో చేరుతారు.

అనంతరం అక్కడ బాదం గింజల వ్యాపారాన్ని ప్రారంభించి.. భారతదేశంలో ఉన్న తమ బంధువుల ద్వారా లావాదేవీలను నిర్వహిస్తారు. బాదంతో పాటు కొకైన్, బ్రౌన్ షుగర్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని చేరవేయడానికి కూడా నియంత్రణ రేఖ వాణిజ్య మార్గాన్ని ముష్కరులు ఎంచుకుంటున్నారు.

దీంతో అప్రమత్తమైన భారత ప్రభుత్వం నియంత్రణ రేఖ గుండా సాగే వర్తకాన్ని నిరవధింకంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో 21 రకాల వస్తువల వాణిజ్యంపై ప్రభావం పడనుంది. వీటిలో ప్రధానంగా అరటిపండ్లు, చింతపండు, ఎండు మిరప, బాదం, ఖర్జూరం, మూలికలు, పిస్తా వంటివి ఉన్నాయి.

అధికారిక లెక్కల ప్రకారం 2008 అక్టోబర్ 21 నుంచి శ్రీనగర్-ముజఫరాబాద్, పూంచ్-రావల్‌కోట్ మార్గాల గుండా ఈ తరహా వర్తకాన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీని ద్వారా ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది.

ప్రస్తుతం అందుతున్న లెక్కల ప్రకారం జమ్మూకశ్మీర్‌కు చెందిన 280 మంది ఈ తరహా వ్యాపారంలో ఉన్నారు. ఈ వ్యాపారంపై నిఘా సంస్థలు ఓ కన్నేసి ఉంచడంతో బాదం గుట్టు తెలిసింది. దీంతో వేర్పాటు వాదులకు నిధులు అందిస్తున్నారన్న ఆరోపణలపై నియంత్రణ రేఖ వాణిజ్య వ్యాపారుల సంఘం అధ్యక్షుడు జహూ అహ్మద్ వతాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

click me!