
న్యూఢిల్లీ: ఉక్రెయిన్(Ukraine)పై దాడి చేసిన రష్యా(Russia)ను అమెరికా సహా నాటో(NATO) దేశాలు అన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా(America) సారథ్యంలో పదికిపైగా దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణను ఖండిస్తూ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే, ఈ తీర్మానంపై భారత్ ఓటేయలేదు. చైనా, యూఏఈలతో పాటు మన దేశం కూడా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. అయితే, రష్యా తీరుపై కొంత సీరియస్‌గా మాట్లాడినా.. దాన్ని ఖండించే తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు. కనీసం రెండు మూడు సార్లు ఉక్రెయిన్ సంక్షోభం విషయమై భారత్‌తో అమెరికా మాట్లాడినప్పటికీ మన దేశం ఓటు వేయకపోవడం అగ్రరాజ్యం కొంత అసంతృప్తికి గురైంది.
కొంతకాలంగా భారత్.. పశ్చిమ దేశాలు, అమెరికాతో చాలా సన్నిహితంగా మెలుగుతున్నది. వాటితో సంబంధాలను మరింత లోతుకు తీసుకెళ్లింది. 21 శతాబ్దంలో భారత్, అమెరికాల బంధం అద్భుతమైనదని బరాక్ ఒబామా ఓ సారి పేర్కొనడం ఈ రెండు దేశాల మధ్య రిలేషన్స్‌ను వెల్లడిస్తుంది. అంతేకాకుండా.. చైనాపట్ల ఈ రెండు దేశాలకు ఉన్న అసంతృప్తి కూడా బంధాన్ని మరింత బలపర్చింది. అదీగాక, క్వాడ్ కూటమిలోనూ కీలక భాగస్వామిగా భారత్ ఉన్నది. చైనా దూకుడుకు ముకుతాడు వేయడానికి అమెరికా ఈ రీజియన్‌లో ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. సరిహద్దు గొడవలతో భారత్ కూడా చైనాపై అసంతృప్తిగానే ఉంటున్నది. ఈ నేపథ్యంలోనే భారత్, అమెరికాలు చాలా దగ్గరయ్యాయి. వాణిజ్యం కూడా చెప్పుకోదగినట్టుగా పెరిగింది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. రష్యాను నిలువరించడానికి విశ్వప్రయత్నాలూ చేస్తున్నది. అందులో భాగంగానే ఐరాసలో తీర్మానం ప్రవేశపెట్టింది. కానీ, తానెంతో విశ్వసించిన భారత్ ఇందుకు దూరంగా ఉండటం చర్చనీయాంశం అయింది. అయితే, ఈ నిర్ణయం భవిష్యత్‌లో అమెరికా, భారత్‌ల మధ్య బంధాల్లో మార్పులను తెస్తుందా? అనే భయాలూ వస్తున్నాయి.
అమెరికాకు ముఖ్యంగా అధికార డెమోక్రాట్లకు రష్యా అంటే ఇప్పుడు తీరని కోపం ఉన్నది. ట్రంప్ గెలుపులో పుతిన్ పాత్ర ఉన్నదని, తప్పుడు సమాచార ప్రచారంతో డెమోక్రాట్లకు దెబ్బ వేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కుట్ర నిజమని ఇప్పటికి నిరూపితం కాలేదు. కానీ, దాన్ని కరాఖండిగా కొట్టేయడమూ జరగలేదు. జనవరి 6న క్యాపిటల్ హిల్‌లో జరిగిన హింస వెనుక ఇలాంటి రెచ్చగొట్టే దుష్ప్రచారాలే ఉన్నాయని అనుమానాలు ఉన్నాయి. అయితే, వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ పుతిన్ ఏ కుట్ర పన్నుతారోననే భయం డెమోక్రాట్లలో ఉన్నది. సోవియట్ యూనియన్ కూలిపోయిన డిసెంబర్ 25 రోజు అమెరికా చరిత్రలోనూ చూడాలని పుతిన్ కలగంటున్నట్టు కొన్ని కథనాలు వచ్చాయి. అందుకే బైడెన్‌కు ఇప్పుడు దేశ, పార్టీ ప్రయోజనాలను వేరు చేసే అవసరం పడట్లేదు. ఇప్పుడు రష్యాను ఒక ప్రత్యర్థిగా కాదు.. పశ్చిమ ప్రజాస్వామ్య దేశాలను తక్కువ చేసే శక్తిగా అమెరికా చూస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే బైడెన్ ఈ సంక్షోభాన్ని ప్రజాస్వామ్యాలకు, నియంతృత్వానికి అనేంతగా మార్చేశాడు.
అయితే, దౌత్యం గురించి మరికాస్త లోతుగా చర్చిస్తే.. అది వాణిజ్యానికి దారి తీస్తుంది. భారత్, అమెరికాలు తమ స్నేహాన్ని ప్రజాస్వామ్యాలుగా జోడించేవి. కానీ, దౌత్యానికి వస్తే.. ఎవరి ప్రయోజనాలు వారివి. అమెరికా ప్రయోజనాలు అమెరికాకు ఉంటే.. మన దేశ ప్రయోజనాలు మనకు ఉన్నాయి. వేలాది మంది ఉక్రెయిన్‌లో చిక్కుకున్నప్పుడు వారిని అక్కడి నుంచి తరలించడానికి రష్యా సహాయం అవసరం. భారత్‌కు రష్యా అతిపెద్ద ఆయుధ సరఫరాదారు. ఐరాసలో పాకిస్తాన్ లేదా చైనాలు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తినప్పుడు రష్యా మద్దతూ అవసరం. ఇలాంటివెన్నో అంశాలు భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉండటానికి దోహదం చేశాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ దేశాలకు భారత్ ఎన్నో విషయాల్లో అవసరం. అతిపెద్ద మార్కెట్‌గా వస్తువులు అమ్ముకోవడానికి సేవలు అందించడానికి, మరెన్నో అంశాలకు భారత్ వాటికి అవసరం.
ఈ కోణంలోనే పశ్చిమ దేశాలు, అమెరికా కూడా ఐరాసలో ఓటింగ్ నేపథ్యంలో భారత్‌ను భవిష్యత్‌లో సరికొత్తగా చూసే అవకాశం ఉన్నది. ఎందుకంటే.. ఈ తీర్మానానికి భారత్ దూరంగా ఉండటం ద్వారా పశ్చిమ దేశాలతో భారత్ ఎన్నిసార్లు రాజీపడి ఒప్పందాలు చేసుకున్నదో కూడా వెల్లడిస్తుంది. తద్వార భవిష్యత్‌లో పశ్చిమ దేశాలు, అమెరికా.. భారత్‌లో మరింత జాగ్రత్తగా ఉండేలా వ్యవహరిస్తాయని, వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం భారత్‌ను మరో మెట్టు ఎక్కిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. భారత్ ఇప్పటికే రష్యాతో పూర్తిగా జట్టు కట్టలేదు. కాబట్టి.. తటస్థంగా ఉన్న మన దేశాన్ని బుజ్జగించే అవకాశాలూ లేకపోలేదని వివరిస్తున్నారు.