
ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. భారత ప్రభుత్వం Operation Ganga పేరిట ఈ తరలింపు ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను ఆ దేశ సరిహద్దుల్లోని రొమేనియా, హంగేరి దేశాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి వారిని రొమేనియా రాజధాని బుకారెస్ట్, హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లకు తరలిస్తున్నారు. బుకారెస్ట్, బుడాపెస్ట్‌లకు చేరుకన్న భారతీయులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలిస్తున్నారు.
ఇప్పటికే రెండు విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. తొలి విమానం బుకారెస్ట్ నుంచి 219 మంది భారతీయలుతో శనివారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకున్న వారికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు. ఇక, రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి బయలుదేరిన రెండో విమానం ఆదివారం తెల్లవారుజామున Delhi airportకు చేరుకుంది. ఇందులో 250 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ ఎయిర్‌పోర్ట్‌లో విద్యార్థులకు స్వాగతం పలికారు.
ఇక, ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులతో కూడిన మూడో విమానం కూడా స్వదేశానికి చేరుకుంది. హంగేరియన్ రాజధాని బుడాపెస్ట్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఇందులో మొత్తం 240 మంది ఇండియన్స్ ఉన్నారు. భారతీయుల తరలింపులో భాగంగా బుడాపెస్ట్ నుంచి భారత్‌కు చేరిన తొలి విమానం ఇది. దీంతో ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం మొదలైన తర్వాత భారత్ స్వదేశానికి తరలించిన భారతీయుల సంఖ్య 709కి చేరింది.
అయితే ఇప్పటికే కొందరు ఎంబసీ అధికారుల సూచనలతో ఉక్రెయిన్ సరిహద్దుల వైపుకు వస్తున్నారు. అయితే ఇంకా వేలాది మంది ఉక్రెయిన్‌లోనే ఉన్నారు. వారి తరలింపు ప్రక్రియను భారత విదేశాంగ శాఖ ముమ్మరం చేసింది. క్రెయిన్‌లో ఉన్న భారతీయులు తమ పాస్‌పోర్ట్‌లు, నగదు (ప్రాధాన్యంగా US డాలర్లలో), ఇతర అవసరమైన వస్తువులు, COVID-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌లను వారి వెంట ఉంచుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది.
భారత్‌కు బయలుదేరిన నాలుగో విమానం..
ఇక, బుకారెస్ట్ నుంచి మరో విమానం భారత్‌కు బయలుదేరింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ వెల్లడించారు. ఉక్రెయిన్ నుంచి Bucharestకు చేరుకున్న భారతీయులతో ఎయిర్ ఇండియా విమానం భారత్‌కు బయలుదేరిందని తెలిపారు. 198 భారతీయులు ఈ విమానంలో స్వదేశానికి వస్తున్నారు.
సూచనలు లేనిదే సరిహద్దులకు వెళ్లొద్దని కేంద్రం ప్రకటన..
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత పౌరులను తీసుకురావడానికి కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లోని భారత పౌరులకు సంబంధించి కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ లోని భారతీయులు ఎలాంటి సరిహద్దు పోస్టులకు వెళ్లవద్దని సూచించింది. ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులందరూ సరిహద్దు పోస్టుల వద్ద భారత ప్రభుత్వ అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులకు వెళ్లవద్దని సూచించింది. వారికి సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేయబడ్డాయనీ, దీని కోసం అధికారులను సంప్రదించాలని పేర్కొంది. భారత రాయబార కార్యాలయం, కైవ్ ఎమర్జెన్సీ నంబర్లును పేర్కొంటూ భారత రాయబార కార్యాలయం ఉక్రెయిన్‌లో తాజా ప్రకటనలో పేర్కొంది.
ఉక్రెయిన్ నుంచి స్లోవేకియా (Slovakia) దేశానికి చేరుకుంటున్న భారతీయులకు అక్కడి భారత ఎంబసీ కీలక సూచనలు చేసింది. స్లోవేకియా ప్రభుత్వ సహకారంతో భారతీయుల తరలింపు ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొంది. ఇందు కోసం ఉక్రెయిన్ సరిహద్దు వద్ద Uzhhorod-Vysne Nemecke వద్ద ఉన్న చెక్ పోస్ట్ ద్వారా స్లోవేకియాలోకి వద్దామనుకుంటున్న భారతీయులు ముందుగా ఓ గూగుల్ ఫారమ్‌లో తమ వివరాలను పొందుపరచాలని కూడా పేర్కొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ప్రకటన స్లోవేకియాలోని భారత ఎంబసీ విడుదల చేసింది.