
ఉత్తరప్రదేశ్ లోని సహన్ పూర్ లో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఎస్ యూవీపై బుల్లెట్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనకు గాయాలు అయ్యాయి. ఈ దాడి నేపథ్యంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని భావించిన ఆజాద్.. హాస్పిటల్ నుంచి మీడియాతో మాట్లాడారు. తన శాంతిని కాపాడాలని, ప్రశాంతంగా ఉండాలని మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు.
‘ఇంత హఠాత్తుగా దాడి జరుగుతుందని ఊహించలేదు. దేశవ్యాప్తంగా ఉన్న నా స్నేహితులు, మద్దతుదారులు, కార్యకర్తలు శాంతిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాజ్యాంగబద్ధంగా పోరాటాన్ని కొనసాగిద్దాం.. కోట్లాది మంది ప్రజల ప్రేమ, ఆశీస్సులతో నేను బాగానే ఉన్నాను..’’ అని ఆయన వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో తెలిపారు.
ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ జిల్లా దేవ్ బంద్ ప్రాంతంలో కొందరు సాయుధులు దాడి చేయడంతో ఆజాద్ కు గాయాలు అయ్యాయి. పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. అందులో జాద్ కారు అద్దాలు పగిలిపోయి కనిపిస్తున్నాయి. ఆజాద్ తన మద్దతుదారుడి ఇంట్లో జరిగిన ‘టెర్హావిన్’ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో దియోబంద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనియన్ సర్కిల్ సమీపంలో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆయన వాహనంపై కాల్పులు జరిగాయి.
ఈ ఘటనపై సమాచారం అందడంతో వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ఈ దాడిలో గాయాలపాలైన వారందరినీ పోలీసులు, ఆజాద్ మద్దతుదారులు సమీపంలోని కమ్యూనిటీ సెంటర్ కు తీసుకెళ్లారు. అక్కడ నుంచి ఆజాద్ ను జిల్లా హాస్పిటల్ కు తరలించారని సహారన్ పూర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ విపిన్ తడా తెలిపారు. కాగా.. ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆజాద్ వాహనంపై దుండగులు నాలుగుసార్లు కాల్పులు జరిపారు. దాడికి పాల్పడిన వారు నలుగురైదుగురు ఉంటారని, ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఎస్పీ తెలిపారు.
ఢిల్లీ మెట్రోలో భారీ ఫైట్.. దారుణంగా కొట్టుకున్న ఇద్దరు వ్యక్తులు.. వైరల్ అవుతున్న వీడియో
ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే ఆయన చికిత్స పొందుతున్న హాస్పిటల్ కు సమీప ప్రాంతాల నుంచి మద్దతుదారులు చేరుకున్నారు. ఆజాద్ కు జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ దాడిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సహరాన్ పూర్ పోలీసులను డీజీపీ విజయ్ కుమార్ ఆదేశించారు.