
Mangaluru: కర్ణాటకలో బీజేపీ కార్యకర్త మృతి చెందిన రెండు రోజుల తర్వాత గురువారం కర్ణాటకలోని మంగళూరు జిల్లా సూరత్‌కల్‌లో 23 ఏళ్ల ముస్లిం యువకుడిని దుండగులు నరికి చంపారు. దీంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సూరత్‌కల్, ముల్కీ, పెరంబూర్, బజ్‌పే సహా ముఖ్యమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. దీనికి సంబంధించి పోలీసులు వెంటనే నిషేధాజ్ఞలు జారీ చేశారు.
ANI నివేదికల ప్రకారం.. మరణించిన యువకుడిని ఫాజిల్‌గా గుర్తించారు. అతనిపై కొంతమంది దుండగులు మారణాయుధంతో దాడి చేశారు. దీంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై మంగళూరు పోలీస్ కమిషనర్ ఎన్ శశి కుమార్ మాట్లాడుతూ “రాత్రి 8 గంటల సమయంలో (జులై 28) సూరత్‌కల్‌లోని కృష్ణపుర కాటిపల్లా రోడ్డు సమీపంలో 23 ఏళ్ల యువకుడిపై నలుగురైదుగురు వ్యక్తులు పాశవికంగా దాడి చేసి ప్రాణాలు తీశారు. ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారని తెలిపారు. సూరత్‌కల్ పోలీస్‌స్టేషన్‌లో హత్య కేసు, సంఘటన సమయంలో మృతుడితో పాటు ఉన్న ప్రత్యక్ష సాక్షి ఫిర్యాదును స్వీకరిస్తున్నామని, మంగుళూరు నగర కమిషనరేట్ పరిధిలోని ముఖ్యమైన ప్రాంతాల్లోని పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సెక్షన్ 144 నిషేధాజ్ఞలు విధించామని తెలిపారు.
జూలై 29 వరకు ఏరియాలోని అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని కమిషనర్ ఆదేశించారు. ముస్లిం నాయకులను వారి ఇళ్ల వద్దే శుక్రవారం ప్రార్థనలు చేయాలని ఆయన అభ్యర్థించారు. శశి కుమార్ మాట్లాడుతూ "సంఘటన వెనుక ఉద్దేశ్యం.. నిందితుల గుర్తింపును దర్యాప్తు చేస్తున్నారు. స్వార్థ-ప్రయోజనాల సమూహాలు వ్యాప్తి చేసే ఎటువంటి పుకార్లకు లొంగవద్దని పౌరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తగిన న్యాయం త్వరగా జరుగుతుంది" అని తెలిపారు. కాగా, బీజేపీ నేతకు నివాళులర్పించేందుకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై జిల్లాకు వచ్చిన సమయంలో ఈ హత్య జరిగింది. కాగా, అంతకుముందు మంగళవారం బెల్లారెలో బీజేపీ యువమోర్చా సభ్యుడు ప్రవీణ్ నెట్టార్‌ను బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు నరికి చంపారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ.. రాష్ట్రంలో మతపరమైన హింసను అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీని కోసం ప్రత్యేక చట్టాలు, ఫోర్స్ ను సైతం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అవసరమైతే యూపీ సర్కారు మాదిరిగా చర్యలు తీసుకుంటామన్నారు.