
Telangana Assembly Elections 2023: తెలంగాణ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. అధికార పార్టీ బీఆర్ఎస్ తన గెలుపు గుర్రాలను ప్రకటించే పనిలో బిజీబిజీగా ఉంటే.. ఈసారైనా అధికార పగ్గాలను కైవసం చేసుకోవాలని అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నాయి. ఈ తరుణంలో బీఆర్ఎస్ అసమ్మతి లీడర్లు, అధిష్టానం ఆదరణ కరువైన నేతలు, ఆయా పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కని నాయకులు మరో పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సమయంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వైపే అన్ని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆయనకు అధిష్టానం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏ పార్టీలో చేరబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో తుమ్మల త్వరలో కాషాయం కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాలేరు నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి అధికార బీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్ చేసిందనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో తుమ్మల బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
గతంలో పాలేరు నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ తరఫున తుమ్మల పోటీ చేసినా.. గెలుపును కైవసం చేసుకోలేకపోయారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నేత ఉపేందర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే..కాంగ్రెస్ నుండి గెలుపొందిన ఉపేందర్ రెడ్డి కూడా అధికార పార్టీ బీఆర్ఎస్ లోనే చేరిపోయారు. దీంతో తుమ్మల ప్రాధాన్యం కాస్త తగ్గిందని పొలిటికల్ టాక్. ఇక రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి అధికార బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన ఒకరిద్దరూ ఎమ్మెల్యేలకు తప్ప మిగతా వారందరికీ బీఆర్ఎస్ అధిష్టానం టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అధిష్టానం నిర్ణయంతో తుమ్మల పార్టీని వీడాలని ఫిక్స్ అయినట్లు సన్నిత వర్గాలు చెబుతున్నాయి. టిఆర్ఎస్ అధిష్టాన షాకింగ్ నిర్ణయానికి తోడు తుమ్మలకు సీఎంకేసీఆర్ సార్ నుండి ఎలాంటి హామీ రాకపోవడంతో .. ఆయన మరింత ఇబ్బందికి గురైనట్లు టాక్. మరోవైపు సీఎం కేసీఆర్ వ్యవహార శైలితో తుమ్మల రాజకీయ జీవితం ప్రశ్నార్ధకంగా మారబోతుందని ఆయన సన్నిహితులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలన్నిటిని గమనించిన బిజెపి పెద్దలు తుమ్మలను తమ గూటికి ఆహ్వానించాలని, అతనికి తమ పార్టీలో సముచిత స్థానం కల్పించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఇప్పటికే బీజేపీ పెద్దలు ఈ విషయమై ఆయనతో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈనెల 27న ఖమ్మంలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమీక్షంలో తుమ్మల కాషాయ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.