మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. కిసాన్ సెల్ అధ్యక్షునిగా మాణిక్‌ కదమ్‌..

Published : Feb 26, 2023, 02:13 PM IST
మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. కిసాన్ సెల్ అధ్యక్షునిగా మాణిక్‌ కదమ్‌..

సారాంశం

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విస్తరణ దిశగా ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఈ  క్రమంలోనే మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీలక నియామకం చేపట్టారు.

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విస్తరణ దిశగా ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఈ  క్రమంలోనే మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీలక నియామకం చేపట్టారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా మాణిక్‌ కదమ్‌ను కేసీఆర్‌ నియమించారు. ఈమేరకు ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నాంసింగ్‌ చడూనీని కేసీఆర్ నియమించిన విషయం తెలిసిందే. ఇక, బీఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాల్లోకి  ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్.. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనే నినాదంతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 5వ తేదీన మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ బహిరంగ సభలో ప్రసంగించిన కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా ప్రజలకు తాగునీరు, సాగునీరు అందడం లేదన్నారు. ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఏం చేశాయి? అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం తనకు చాలా బాధ కలిగించిందని చెప్పారు. ఎన్నో న‌దులు ప్ర‌వ‌హిస్తున్న రాష్ట్రంలో రైతులు ఆత్మ‌హ‌త్యాలు చేసుకోవ‌డం ఎంతో బాధిస్తోందని అన్నారు. 

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ (ఈ సారి రైతు ప్ర‌భుత్వం) అని చెబుతూ.. ఇప్పుడు జాతీయ స్థాయికి వెళ్లాలని కేసీఆర్ అన్నారు. ‘‘ఇప్పుడు దేశంలో పెద్ద మార్పు అవసరం. చాలా మంది వచ్చి సుదీర్ఘ ప్రసంగాలు చేసి వెళ్లిపోతారు. వాళ్ళు తమ మనసులోని మాట మాట్లాడుకుని వెళ్ళిపోతారు. 75 ఏళ్లు గడిచినా దేశానికి నీళ్లు, కరెంటు రావడం లేదు. ఖాళీ దేశంలో ప్రసంగం సాగుతోంది, రైతును ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ విష‌యంలో మార్పు రావాలి’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.


ఇక, మహారాష్ట్ర రైతులకు తెలంగాణ మోడల్‌ రైతు సంక్షేమాన్ని ప్రకటించిన కేసీఆర్.. అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా 24/7 విద్యుత్‌ సరఫరా, రైతు బీమా వంటి విధానాలను అమలు చేస్తామని అన్నారు. మహారాష్ట్ర రైతులు తమ పొలాల్లో నాగలిని నడపడంతో పాటు చట్టాలు రాయడం, అమలు చేయడం నేర్చుకోవాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం