
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గడ్‌లో సోనియా గాంధీ చేసిన ప్రసంగంతో ఆమె రిటైర్‌మెంట్ పై ఓ గందరగోళం నెలకొంది. ఆమె రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్టు అంతా మాట్లాడారు. మీడియా సంస్థలూ అలాగే రాసుకొచ్చాయి. కానీ, ఈ కన్ఫ్యూజన్ పై పార్టీ ప్రతినిధి అల్కా లాంబా స్పష్టత ఇచ్చారు. ఆమె ఎప్పుడూ రిటైర్ కాలేదని, ఎప్పుడూ కాబోదని స్పష్టం చేశారు.
ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల ప్లీనరీ సమావేశాల్లో ప్రతినిధి ఆల్కా లాంబా మాట్లాడారు. సోనియా గాంధీ ప్రసంగాన్ని తప్పుగా చిత్రించడాన్ని మానుకోవాలని అన్నారు. ఆమె ప్రసంగాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు. ఆమె ఎప్పుడూ రిటైర్ కాలేదని అన్నట్టు తెలిపారు. భవిష్యత్‌లోనూ ఎప్పుడూ రిటైర్ కాబోదనీ అన్నారు. కాబట్టి, సోనియా గాంధీ రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారన్నట్టుగా వార్తలు రాయవద్దని ఆమె మీడియాను కోరారు.
ఈ ప్లీనరీ సమావేశాల్లో నిన్న సోనియా గాంధీ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఆమె రిటైర్ కాబోతున్నట్టుగా చర్చను తెచ్చాయి. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగుస్తుండటం సంతోషంగా ఉన్నదని ఆమె పేర్కొనడంతో ఈ చర్చ మొదలైంది.
Also Read: భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగింపు దశకు చేరుకుంది - సోనియా గాంధీ
‘2004, 2009 ఎన్నికల్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో సాధించిన విజయాలు నాకు వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చాయి. కానీ, కాంగ్రెస్‌కు కీలక మలుపు ఇచ్చిన భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగియడం సంతోషాన్ని ఇస్తున్నది. భారతీయులు సామరస్యం, ఉదారత, సమానత్వం కోరుకుంటున్నారని ఈ యాత్ర నిరూపించింది.’ అని యునైటెడ్ ప్రొగ్రెస్సివ్ అలయెన్స్ (యూపీఏ) చీఫ్ సోనియా గాంధీ అన్నారు.