
న్యూఢిల్లీ: భర్త నుంచి విడాకులు తీసుకున్న సోదరి ఆర్థిక కష్టాల్లో ఉంటే సోదరుడు కూడా ఆమెకు హెల్ప్ చేయాల్సిన బాధ్యత కలిగి ఉంటాడని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. విడాకులు తీసుకున్న భార్యకు మాజీ భర్త నుంచి భరణం వస్తుందని, కానీ, ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు సోదరుడు మౌనంగా చూస్తూ ఉండకూడదని వివరించింది. విడాకులు తీసుకున్న ఓ మహిళ తన భర్త నుంచి భరణాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తూ ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
సాధారణంగా విడాకులు తీసుకున్న ఇచ్చే భరణాన్ని ఆమె మాజీ భర్త సంపాదన ఆధారంగా నిర్ణయిస్తారు. ఆ సంపాదన మీద ఎంత మంది ఆధారపడ్డారు అనేది పరిగణనలోకి తీసుకుని మాజీ భార్యకు నెలవారీగా చెల్లించాల్సిన మొత్తాన్ని కోర్టు స్పష్టం చేస్తుంది. తాజా పిటిషన్‌లో విడాకులు తీసుకున్న భార్య తనకు భరణం పెంచాలని డిమాండ్ చేస్తూ.. తన మాజీ భర్త విడాకులు తీసుకున్న ఆయన సోదరిని కూడా ఆయనపై ఆధారపడిందని చెప్పడం సరికాదని వాదించింది. కానీ, ఈ వాదనను ఢిల్లీ హైకోర్టు తిప్పికొట్టింది.
పిటిషనర్‌కు ఆమె మాజీ భర్తకు ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు ఇప్పుడు మేజర్. ఈ విడాకుల తర్వాత ఆ మాజీ భర్త మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికీ ఒక కూతురు. అంతేకాదు, పిటిషనర్ మాజీ భర్తకు ఒక సోదరి ఉన్నది. ఆమె కూడా విడాకులు తీసుకుని ఆయనపై ఆధారపడి ఉన్నది. వీరితోపాటు తండ్రి కూడా ఆయనపైనే ఆధారపడి ఉన్నారు. పిటిషనర్ మాజీ భర్త వాదన ఏమంటే.. తనకు వచ్చే జీతంపై ఇంత మంది ఆధారపడి ఉన్నారని, తన మాజీ భార్యకు భరణాన్ని మరింత పెంచి ఇచ్చుకోలేనని పేర్కొన్నాడు. కానీ, పిటిషనర్ వాదన ఏమంటే.. తన మాజీ భర్తపై విడాకులు తీసుకున్న సోదరి ఎలా ఆధారపడి ఉంటుంది. విడాకులు తీసుకున్న సోదరిని ఆయనపై ఆధారపడిన వ్యక్తిగా పేర్కొనరాదని వాదించింది.
పిటిషనర్ వాదనను ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. భారత సమాజంలో అక్కా చెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లు అంతా కలిసే ఉంటారని, ప్రతి పండుగకు ఒకరినొకరు ఆదరించుకుంటారని, అవసరాలకు ఆదుకునేలాగే పెరుగుతారని వివరించింది. ఒకరిపట్ల ఒకరు బాధ్యతతో ఉంటారని తెలిపింది. కాబట్టి, సోదరి విడాకులు తీసుకుని ఉండొచ్చు. ఆమె కూడా తన మాజీ భర్త నుంచి భరణం పొందుతూ ఉండొచ్చు. కానీ, ఆమెకు ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు సోదరుడు సహాయం చేయకుండా ఉండరాదని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వరణ కాంత శర్మ వివరించారు.
అంతేకాదు, ఆయనపై ఆధారపడే తల్లిదండ్రులనూ చూసుకోవడం ఆయన నైతిక బాధ్యతే అని తెలిపారు. అయితే, వీరికి ప్రతి నెలా ఇంత చెల్లించాలనే లెక్కలేమీ వేయాల్సిన అవసరం లేదని, ఏడాదికి ఇంత అని లెక్కపెట్టినా సరిపోతుందని వివరించారు. పిటిషనర్ మాజీ భర్తకు టేక్ హోం సాలరీ రూ. 35 వేలు వస్తున్నదని కోర్టుకు వివరించారు.
పిటిషనర్‌కు భరణాన్ని రూ. 6000 నుంచి రూ. 7,500లకు పెంచుతూ తీర్పు ఇచ్చింది.