
లక్నో: మానవ సంబంధాలు మంట గలిసిపోతున్నాయనే మాటకు సజీవ సాక్ష్యం ఈ ఘటన. సమాజంలో నేర ప్రవృత్తితో పెచ్చరిల్లుతున్నదని అనడానికి అదీ ముఖ్యంగా పిల్లల్లోనూ కనిపిస్తున్నదని చెప్పడానికి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటనే నిదర్శనం. ఓ 16 ఏళ్ల అబ్బాయి.. పబ్ జీ ఆడనివ్వట్లేదని కన్న తల్లినే హతమార్చాడు. మమకారం కాదు కదా.. కనీస కనికరం కూడా లేకుండా తల్లిని తుపాకీతో కాల్చి చంపేశాడు. అంతేకాదు, ఆ డెడ్ బాడీని ఇంటిలోని ఓ గదిలో పెట్టి లాక్ వేశాడు. తల్లి మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకునే ఆ
బాలుడు తన ఫ్రెండ్స్‌ను టైం పాస్ కోసం ఇంటికి పిలిచాడు. ఇద్దరు ఫ్రెండ్స్‌ను ఇంటికి ఆహ్వానించి ఓ హిందీ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. ఎగ్ కర్రీని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని తిన్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన పీజీఐ ఏరియాలో జరిగింది.
ఫ్రెండ్స్ ఎప్పుడు ఇంటికి వచ్చినా తల్లి కనిపించేది. కానీ, ఈ సారి కనిపించకపోవడంతో ఆ ఫ్రెండ్సే తల్లి ఏదని అడిగారు. ఆ ప్రశ్నకు కూడా ఆ 16 ఏళ్ల అబ్బాయి తటపటాయింపులు లేకుండా బంధువుల ఇంటికి వెళ్లిందని సింపుల్‌గా చెప్పేశాడు. అంతేకాదు.. పోలీసులకూ ఓ కట్టుకథ చెప్పి వారిని తప్పుదోవ పట్టించాలని ఎత్తు వేశాడు. అందుకు ఓ ప్రణాళిక ప్రకారమే కథ చెప్పాడు. కానీ, విచారణలో నిజం బయటకు వచ్చింది. తన తల్లిని తానే హత్య చేశానని చివరు అంగీకరించాడు.
పీజీఐ ఏరియాలో సాధన అనే మహిళ తన కుమారుడు, కుమార్తెతో కలిసి జీవిస్తున్నారు. ఆమె భర్త మిలిటరీ ఉద్యోగి. ఉద్యోగ నిమిత్తం ఆయన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉంటున్నాడు. కుమారుడు, కుమార్తెలతో సాధన కుటుంబం సాఫీగానే సాగిపోతున్నది. కానీ, ఇప్పుడు చాలా మంది పిల్లలు ఆన్‌లైన్ గేమ్‌లకు బానిస అవుతున్నట్టే ఆమె కుమారుడు కూడా తరుచూ పబ్ జీ అనే గేమ్(ఈ గేమ్‌లోనూ విపరీతమైన హింస ఉంటుందనేది తెలిసిన విషయమే)లోనే మునిగి తేలాడు. ఈ విషయం గ్రహించిన తల్లి కుమారుడిని మందలించింది. ఆమె కొడుకు తిరగబడ్డాడు. కొన్ని రోజల పాటు ఇదే తంతు కొనసాగింది. చివరకు ఆదివారం అర్ధరాత్రి తండ్రికి చెందిన లైసెన్స్ తుపాకీని తీసుకుని తల్లిని కాల్చి చంపాడు.
గుట్టుగా ఎవరికీ తెలియవద్దని తల్లి మృతదేహాన్ని ఓ రూమ్‌లోకి నెట్టుకొచ్చి లాక్ వేశాడు. చెల్లిని భయపెట్టి మరో రూమ్‌లో బంధించాడు. మిగతా ఇల్లంతా ఎప్పట్లాగే ఆ బాలుడు తిరుగుతూ గడిపాడు. అసలు ఏమీ జరగనట్టే ఫ్రెండ్స్‌ను కూడా ఇంటికి రప్పించుకుని ఎంజాయ్ చేశాడు.
కానీ, డెడ్ బాడీ నుంచి దుర్వాసన రావడం మొదలైంది. దీంతో ఆ బాలుడు రూమ్ ఫ్రెషనర్‌తో దుర్వాసనను కప్పిపెట్టే ప్రయత్నం చేశాడు. అలా కొన్ని గంటలు మాత్రమే సాధ్యమైంది. ఆ డెడ్ బాడీని మూడు రోజులు రూమ్‌లో దాచి ఒక్కడే ఇంటిలో గడిపాడు. కానీ, చివరకు ఆ డెడ్ బాడీ నుంచి దుర్వాసన ఇరుగుపొరుగు వారికి చేరింది. వారిలోనూ అనుమానాలు రావడంతో పోలీసులకు విషయం చేరవేశారు. పోలీసులు ఆ బాలుడిని ప్రశ్నించారు. పోలీసులకు ఓ కట్టుకథను వినిపించే సాహసం చేశాడు. తన తండ్రిని కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది.
తమ ఇంటికి ఓ ఎలక్ట్రీషియన్ వచ్చాడని, ఆయనతో తల్లికి వాగ్వాదం జరిగిందని ఆ బాలుడు పోలీసులకు అబద్ధాలు చెప్పాడు. ఆ ఎలక్ట్రీషియనే తన తల్లిని చంపాడని నమ్మబలికాడు. కానీ, పోలీసులు తమదైన పద్ధతిలో విచారించగా అసలు విషయాన్ని బయటకు కక్కాడు. తానే చంపినట్టు నేరాన్ని అంగీకరించాడు.