Crime News: వేడి వేడి చపాతీలు వేయలేదని పెళ్లి విందులో గొడవ.. వంట మనిషిపై సలసల కాగే నూనె పోసి..

By Mahesh K  |  First Published Nov 30, 2023, 10:53 PM IST

ఉత్తరప్రదేశ్‌లో ఓ పెళ్లి విందులో ఘోరం జరిగింది. వేడి వేడి రోటీ వేయలేదని వంట మనిషిపై సలసల కాగే నూనెను పోశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. వంట మనిషి పరిస్థితి విషమంగా ఉన్నది.
 


న్యూఢిల్లీ: పెళ్లి విందులో రకరకాల వంటకాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు అతిథులు. అయితే.. వరుడు, లేదా వధువు తరఫు దగ్గరి బంధువులైతే వారికి ట్రీట్‌మెంట్ కొంచెం వేరుగా ఉంటుంది. వేడి వేడి వంటకాలు, కావాల్సినవన్నీ వీరికి అందుబాటులో ఉంచుతారు. సుష్టిగా భోజనం చేయడానికి వీరికి వెసులుబాటు ఉంటుంది. కానీ, పెళ్లి కొడుకు దగ్గరి బంధువుకు ఇలాంటి సేవలు అందకపోవడంతో అగ్గి మీద గుగ్గిళం అయ్యాడు. వేడి వేడి రోటీలు వేయాలని అడగ్గా.. ఇప్పుడు వేడి వేడి రోటీలను చేయలేనని సమాధానం వచ్చింది. దీంతో మరో ఇద్దరు మిత్రులను వెంటబెట్టుకుని వెళ్లి వంటగాడిపై దాడి చేశాడు. సలసల కాగుతున్న నూనెను మీద పోశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

ఈ ఘటన మూసాజాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వరుడి బంధువు ఇంద్రపాల్ తనకు వేడి వేడి రోటీలు కావాలని వంట మనిషిని అడిగాడు. కానీ, అప్పటికే తందూర్ ఆరిపోయిందని, ఇప్పటికే చేసిన రోటీలు వేసుకోవాలని వంట మనిషి రాజేశ్ ఆయనకు బదులు ఇచ్చాడు. ఈ సమాధానంతో ఇంద్రపాల్ అసహనానికి గురయ్యాడు. 

Latest Videos

Also Read : Exit Polls: 2018లో సరిగ్గా అంచనా వేసిన సర్వే ఇప్పుడేం చెబుతున్నది?

ఇంద్రపాల్ మరో ఇద్దరు స్నేహితులతో ఈ విషయాన్ని చెప్పుకున్నాడు. వారు ముగ్గురూ కలిసి రాజేశ్ వద్దకు వెళ్లారు. రాజేశ్ అప్పటికే మరో విందు కోసం సన్నాహకాలు చేస్తున్నాడు. వీరు ముగ్గురూ రాజేశ్ పై దాడికి దిగారు. కడాయిలో సలసల కాగుతున్న వేడి నూనెను రాజేశ్ పై పోశారు. రాజేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఆ ముగ్గురు నిందితులు ఘటనా స్థలి నుంచి పారిపోయారు. ఆయనను వెంటనే హాస్పిటల్ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేయడానికి గాలింపులు జరుపుతున్నారు. ఈ ఘటన వివాహ వేడుకను గందరగోళ పరిచింది. అతిథులు ఖంగుతిన్నారు.

click me!